ఒక సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అందరికీ సౌరశక్తిని అందించడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం గ్లాస్గోలో జరుగుతున్న COP26 వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్’ (IRIS)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరని గత కొన్ని దశాబ్దాలు రుజువు చేశాయన్నారు.
అనంతరం స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, నేపాల్, మలావి, ఉక్రెయిన్, జపాన్ ,అర్జెంటీనా నాయకులతో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆ తర్వాత బిల్ గేట్స్‌ను కూడా కలవనున్నారు. 2070 నాటికి భారతదేశం నికర-శూన్య కర్బన ఉద్గారాలను సాధిస్తుందని ప్రధాని మోడీ ప్రతిజ్ఞ చేశారు. పారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కట్టుబాట్లను తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం తమదేనని ప్రధాని మోడీ ప్రపంచ దేశాలకు నొక్కి చెప్పారు.
