Site icon NTV Telugu

Nuclear War: అణు యుద్ధం జరిగితే భూమిపై “ఐస్ ఏజ్”.. తాజా అధ్యయనంలో వెల్లడి

Nuclear War

Nuclear War

రష్యా, ఉక్రెయిన్ వార్, నాటో- రష్యాల మధ్య ఘర్షణ, చైనా-తైవాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచంలో న్యూక్లియర్ వార్ భయాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తో యుద్ధ సమయంలో రష్యా నాయకులు అణుయుద్ధం పేరుతో బెదిరింపులకు దిగారు. తమపై నాటో దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణు యుద్ధం జరిగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మల్లీపుల్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ సహకారంతో అధ్యయనం చేశారు. అణు యుద్ధం రష్యా- నాటో మధ్య జరిగినా.. పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగినా ప్రపంచంపై ప్రభావం చూపిస్తుందని యూనివర్సిటీ ప్రొఫెసర్ చెరిల్ హారిసన్ అన్నారు. అణుయుద్ధం వల్ల విడుదలైన పొగ ఎగువ వాతావరణంలోకి చేరి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందని ఆయన అన్నారు.

Read Also: Gargi Movie Trailer: ఒక్కరోజులోనే తలకిందులైన సాయి పల్లవి జీవితం..

అణుయుద్ధం ప్రభావం వల్ల భూమి మొత్తం అంధకారంగా మారుతుందని.. ఉష్ణోగ్రతలు క్షీణించి, సముద్రాల్లోని జీవులు మరణిస్తాయని అధ్యయనంలో తేలింది. అణుయుద్ధం వల్ల వాతావరణంలోకి విపరీతంగా పొగ, మసి చేరుతుందని.. ఇది సూర్యకాంతిని అడ్డుకుంటుందని, దీని వల్ల మొదటి నెలలోనే ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల ఫారెన్ హీట్ తగ్గుతాయని స్టడీ తేల్చింది. సముద్ర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు సుమారు ఆరు మిలియన్ మైళ్ల వరకు విస్తరిస్తుందని.. చైనాలోని టియాంజిన్, కోపెన్ హాగన్, సెయింట్ పీటర్స్ బర్గ్ వంటి ప్రధాన ఓడరేవులు మంచుతో నిండిపోతాయని అధ్యయనం వెల్లడించింది. దీంతో పాటు ఆర్కిటిక్ సముద్రపు మంచులో వేల ఏళ్ల పాటు మార్పులు కొనసాగుతాయని తేలింది. ఇది ‘మంచు యుగానికి’ దారి తీస్తుందని అధ్యయనం తేల్చింది.

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయిన తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అణుయుద్ధం గురించి ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే లూసియానా యూనివర్సిటీ భూమిపై అణుయుద్ధ ప్రభావం గురించి అధ్యయనం చేసింది.

Exit mobile version