Site icon NTV Telugu

Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటన

Nobel Prize

Nobel Prize

Nobel Prize: ఆర్ధిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు బ్యాంకింగ్ రంగ నిపుణులకు నోబెల్ బహుమతి దక్కింది. ఈ మేరకు బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్​‌‌‌కు నోబెల్ కమిటీ అవార్డు ప్రకటించింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు వీరికి అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రంలో విజేతలను నోబెల్ కమిటీ ప్రకటించింది. అనంతరం సాహిత్య రంగంలో విజేతను అక్టోబర్ 6న ప్రకటించారు. అక్టోబర్‌ 7న నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించారు. తాజాగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటనతో ఈ ఏడాది అన్ని రంగాల్లో అవార్డులు ముగిశాయి.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. ఈ నగదును ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

కాగా ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ బహుమతి స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. భౌతిక శాస్త్రంలో అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. సాహిత్య రంగంలో ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్ నోబెల్ అవార్డును దక్కించుకున్నారు. రసాయన శాస్త్రంలో కారోలిన్‌ బెర్టోజి, మార్టిన్‌ మెల్డల్‌, బారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. అటు మానవ హక్కుల కోసం పాటుపడిన బెలారస్‌​కు చెందిన అలెస్​ బియాలియాట్స్కీ, రష్యన్​ మానవ హక్కుల సంస్థ అయిన ‘మెమోరియల్’, ఉక్రెయిన్​ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ అయిన ‘సెంటర్​ ఫర్ సివిల్ లిబర్టీస్​’కు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించింది.

Exit mobile version