Site icon NTV Telugu

Nobel Peace Prize 2025: నోబెల్‌ శాంతి బహుమతి.. ట్రంప్‌ ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందా..?.

Nobel Peace Prize 2025

Nobel Peace Prize 2025

Nobel Peace Prize 2025: తనను తాను పీస్ ప్రెసిడెంట్‌గా పిలుచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందని గట్టి నమ్మకంగా ఉన్నాడు. నార్వేలోని ఓస్లోలో నార్వేజియన్ కమిటీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును నేడు ప్రకటించనుంది. 338 మంది వ్యక్తులు, సంస్థలు ఈ బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే, వీరిలో డొనాల్డ్ ట్రంప్‌కు ఈ గౌరవం దక్కుతుందా లేదా అన్నదానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. చాలా రోజులుగా నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలని చెబుతున్న డొనాల్డ్‌ ట్రంప్ చివరి ప్రయత్నంగా బహుమతి ప్రకటనకు ఒకరోజ ముందు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం అయ్యేలా ప్లాన్ చేశారు. తాను అధ్యక్షుడిని అయ్యాకే ప్రపంచం శాంతిగా ఉందని… ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్నారు. ఇండియా-పాక్ కాల్పుల విరమణలో కూడా తన పాత్ర ఉందని పదేపదే ప్రకటించుకున్నారు. దీనిని మన దేశం ఎన్నిసార్లు ఖండించినా… ఆయన మాత్రం పాతపాటే పాడుతున్నారు.

Read Also: Niharika NM: యూట్యూబ్‌ నుంచి సిల్వర్‌ స్క్రీన్‌ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్‌ స్టోరీ

ట్రంప్‌కు మద్దతిస్తూ ఇప్పటికే పాకిస్తాన్, అజర్ బైజాన్, అర్మేనియా, కంబోడియా వంటి దేశాలు ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి. ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించినట్టు చెప్పిన ట్రంప్.. నోబెల్‌ బహుమతికి తనను అనేక దేశాలు నామినేట్ చేసినట్టు తెలిపారు. కానీ నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకపోవడానికి ఏదో ఒక కారణం చెబుతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మెడిసిన్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ విభాగాల్లో నోబెల్‌ పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. దీంతో అందరి చూపు నోబెల్‌ శాంతి బహుమతిపై పడింది. ఇవాళ నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ పీస్ ప్రైజ్ విజేతను ప్రకటించనుంది. దీంతో ట్రంప్‌ కు టెన్షన్ పెరిగిపోతోంది. ఈ బహుమతి ఎవరికి దక్కుతుందా అని ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్‌ నామినేషన్లు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. చూడాలి మరి ఈసారైనా నోబెల్ పీస్ ప్రైజ్ ఆయన్ని వరిస్తుందో లేదో ? చూడాలి మరి..

Exit mobile version