NTV Telugu Site icon

Pakistan Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాక్‌.. పుస్తకాలకు కూడా డబ్బుల్లేవ్‌..

Pakistan Crisis

Pakistan Crisis

ఇటీవల శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు పాకిస్థాన్‌లోనూ ఈ రకమైన సంక్షోభం కొనసాగుతోంది. అది కూడా పతాకస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే పలు రంగాలు ఈ సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కొంటుండగా.. తాజా స్కూల్ విద్యార్థులపై ఆ ప్రభావం పడబోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ఇప్పుడు పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించలేని స్థితికి వచ్చింది. కాగితం కొరత కారణంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండవని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే ముద్రించాల్సిన సింధ్, పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా బోర్డులు కూడా పుస్తకాలను ముద్రించలేదు.

ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు పేపర్ సంక్షోభం కారణంగా విద్యార్థులకు అందుబాటులో ఉండవని ఆల్ పాకిస్థాన్ పేపర్‌ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ (PAPGAI)తోపాటు ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఖైజర్ బెంగాలీ తెలిపారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో పేపర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేపర్ చాలా ఖరీదైన వస్తువుగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.