Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు

  • నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం!
  • మూసుకున్న న్యాయ మార్గాలు
  • త్వరలోనే అప్పగించే అవకాశం
Nirav Modi

Nirav Modi

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధమైంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించనుంది. చివరి అవకాశంగా న్యాయ మార్గాలు కూడా మూసుకున్నాయి. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR)లో దాఖలు చేసిన తన చివరి న్యాయపరమైన సవాల్‌లో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో భారత్‌కు అప్పగింతను అడ్డుకునే అన్ని న్యాయ మార్గాలు ముగిసినట్లయ్యాయి.

యూకే కోర్టుల్లో అందుబాటులో ఉన్న అన్ని అప్పీల్ అవకాశాలు పూర్తిగా ముగిసిన అనంతరం.. 2026 ఏప్రిల్‌లో నీరవ్ మోడీ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించారు. అయితే ఆయనకు ఎలాంటి ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో అప్పగింతను నిలిపివేయడానికి ఆయనకు ఇకపై ఎలాంటి న్యాయపరమైన అవకాశం మిగలలేదు. న్యాయ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో యూకే ప్రభుత్వం నీరవ్ మోడీని భారత అధికారులకు అప్పగించేందుకు అవసరమైన పరిపాలనా చర్యలను ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. అప్పగింత ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి లండన్‌లోని హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన బహుళ కోట్ల రూపాయల రుణ మోసం కేసుతో పాటు దానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను భారత్‌కు తీసుకురావడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గత కొన్ని సంవత్సరాలుగా న్యాయపోరాటం కొనసాగిస్తున్నాయి. నీరవ్ మోడీ అప్పగింత పూర్తయితే.. దేశంలో సంచలనం సృష్టించిన పీఎన్‌బీ మోసం కేసు దర్యాప్తులో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం ఆయనపై పెండింగ్‌లో ఉన్న కేసులపై విచారణ మరింత వేగవంతం కానుంది.