నైజీరియాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఫుట్‌బాల్ మైదానంలో టెర్రరిస్టులు తుఫాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు.
ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని అడమావా రాష్ట్రం గుయాకు గ్రామంలోని ఫుట్‌బాల్ మైదానంలో ప్రజలు గుమిగూడి ఉండగా ఉగ్రవాదులు ఆకస్మాత్తుగా దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. ఇళ్లను, ప్రార్థనా మందిరాలను, మోటార్ సైకిళ్లను తగలబెట్టారు. కొన్ని గంటల పాటు ఈ బీభత్సం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. దాడి వెనుక ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు.
రాష్ట్ర గవర్నర్ అహ్మదు ఉమారు ఫింటిరి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ దాడిని ‘‘మానవత్వానికి అవమానం’’గా అభివర్ణించారు. ప్రజల భద్రత కోసం వెంటనే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కామెరూన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ వంటి ఉగ్రవాద సంస్థలు హింసకు పాల్పడుతున్నాయి. 2009లో ప్రారంభమైన బోకో హరామ్ తిరుగుబాటుతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ సంక్షోభం నైజర్, చాద్, కామెరూన్ దేశాలకు కూడా వ్యాపించింది.
ఈ దాడిపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో పెరుగుతున్న భద్రతా సమస్యలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
