Monkeypox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో కూడా మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. నగరంలోని లక్షన్నర మంది ప్రజల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ ఎరిక్ ఆడమ్స్, హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ విభాగ కమిషనర్ అశ్విన్ వాసన్ తెలిపారు. ప్రస్తుతం న్యూయార్క్ రాష్ట్రవ్యాప్తంగా 1,400 మంకీపాక్స్ కేసులున్నాయి. నగరం వైరస్ వ్యాప్తి కేంద్రంగా మారింది. దీంతో కట్టడి చర్యలకు వీలుగా ప్రజారోగ్యం దృష్ట్యా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
Monkeypox: మంకీపాక్స్ వర్సెస్ చికెన్‌పాక్స్.. తేడాలేంటీ.. వైద్యులేమంటున్నారంటే?
అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ తక్షణమే అమలులోకి వస్తుందని మేయర్ ఎరిక్ ఆడమ్స్ వెల్లడించారు. ఈ క్రమంలో డీఓహెచ్‌ఎంహెచ్ న్యూయర్క్ సిటీ హెల్త్ కోడ్ కింద అత్యవసర ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వ్యాధిని నియంత్రణలోకి తెచ్చేలే సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మంకీపాక్స్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మంకీపాక్స్ వ్యాప్తి అంతర్జాతీయ పరంగా గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సూచిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ప్రస్తుతం 75 దేశాలకు వ్యాపించి సుమారు 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.