Site icon NTV Telugu

పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్‌కి శిక్ష.. చైనా కొత్త చట్టం!

చైనాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎంత కఠినంగా ఉంటాయో వాటిని అంతే కఠినంగా అమలు చేయటం డ్రాగన్‌ స్పెషాల్టీ. అలాంటివి ఇప్పటికే అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరొకటి జతవుతోంది. చైనాలో వ్యక్తి స్వేచ్చ తక్కువ. కమ్యూనిస్టు పార్టీ అధినాయకుడే దేశాధినేత. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాదాపు అదే ఫైనల్‌.

ఎదిగే పిల్లలకు సంబంధించి ఓ సంస్కరణల చట్టం కోసం ముసాయిదా రెడీ చేసింది. ఇంతకూ అదేమిటంటే “ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా”. పిల్లలు తప్పు చేసినా.. నేరాలకు పాల్పడితే వారి తల్లిదండ్రులను శిక్షిస్తారు. ఈ చట్టం ముసాయిదా ప్రస్తుతం పార్లమెంట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిటింగ్‌. అది పచ్చ జెండా ఊపటం లాంఛనమే. ఐతే, ఈ తాజా ప్రతిపాదన చైనా నియంతృత్వ దోరణికి అద్దంపడుతుంది.

పిల్లలు ఎదిగే దశలో తొందరగా చెడుకు ఆకర్షితులవుతారు. తీవ్రమైన తప్పులు చేస్తారు. చివరకు అవి వారిని నేరాల వైపు నడిపిస్తాయి. తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్నారుల నడవడికపై ఫోకస్‌ పెట్టకపోవటం..వారు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవటం..పిల్లల చర్యలపట్ల అవగాహన లేమి. ఇలా చాలా కారణాలు ఉంటాయి ఎదిగే పిల్లలు చెడిపోవటానికి. వీటిపై చైనా ఇప్పుడు దృష్టిపెట్టి చర్యలకు ఉపక్రమిస్తోంది.

చట్టాలు కఠినంగా ఉన్నా వాటి వల్ల మంచే జరుగుతుంది. పిల్లలను ఒక పద్దతి ప్రకారం పెంచాలన్నది చైనా లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు పెరిగిన తీరు భవిష్యత్‌లో దేశం మీద పడుతుంది. అందుకే తల్లి దండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలో కొత్త చట్టం ముసాయిదాలో పొందు పరిచారు. చిన్నారులకు విద్య ఎంత ముఖ్యమో వారికి మనో వికాసం కూడా అంతే ముఖ్యమని చైనా పాలకులు నమ్ముతున్నారు. అందుకే పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, వ్యాయామానికి ప్రత్యేక సమయాలు కేటాయించాల్సి వుంటుంది. ఆన్‌లైన్ గేమ్స్‌, పిల్లల ఇంటర్నెట్‌ వాడకాన్ని కంట్రోల్‌ చేయటానికి తల్లిదండ్రుల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది చైనా. పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా ఆ భయం ఉండాలన్నది దీని సారాంశం.

కొంత కాలంగా చిన్నారులపై చైనా ఎక్కువ దృష్టి పెడుతోంది. ఆ దిశగా సంస్కరణలు చేస్తోంది. గత ఆగస్టులో ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఆంక్షలు విధించింది. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడేందుకు ఒక్క గంట మాత్రమే అనుమతిచ్చింది. అది కూడా శుక్ర..శని..ఆదివారాలతో పాటు ఇతర సెలవు దినాల్లో మాత్రమే. ఏ టైమ్‌ లో ఆడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించింది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది గంల మధ్య మాత్రమే గేమ్స్‌కు అనుమతి. ఇతర సమయాల్లో పిల్లలు గేమ్స్ ఆడకుండా ఆటోమేటిక్‌గా గేమింగ్‌ కంపెనీలు నిరోధిస్తాయి. లేదంటే వాటిపైనా కఠిన చర్యలు తప్పవు. ఆన్‌లైన్ గేమ్స్‌ పిల్లల పాలిట మత్తు మందని చైనా ప్రభుత్వం బావిస్తోంది. అతిగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం చిన్నారులపై కలిగే దుష్ప్రభావాలను చాలా కాలంగా గమనించి చైనా ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలు గేమ్స్ కోసం పెద్దల ఐడీలు వాడకుండా ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ పద్దతి ప్రవేశపెట్టారు.

చిన్నారులు పెరిగే వయసులోనే సరైన విలువలు నేర్పాలని చైనా బావిస్తోంది. అందుకే ఈ దిశగా సంస్కరణలు చేపట్టింది. ఇన్షర్మేషన్‌ టెక్నాలజీ పురోగతి వారిపై చెడు ప్రభావాన్ని నిరోధించటం కూడా ఈ సంస్కరణలలో భాగం. పిల్లల విషయంలో చైనా తీసుకున్న మరో సంచలన నిర్ణయం.. ఆరు, ఏడేళ్ల పిల్లలకు రాత పరీక్షలను నిషేదించటం. తల్లిదండ్రులు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం వెనక ఉన్న ఉద్దేశం. పసి పిల్లలపై ఇలాంటి ఒత్తిడి వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఒక జంట ఎంతమంది పిల్లలను కనాలో కూడా చైనా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. 1979 నుంచి 2016 వరకు వన్‌ చైల్డ్‌ పాలసీ అమలులో ఉంది. తరువాత ఇద్దరు పిల్లలకు అనుమతిచ్చారు. అయినా జననాల రేటు బాగా తగ్గిపోయింది. దీంతో కలవరపడిన చైనా పాలకులు ముగ్గురు పిల్లల వరకు కనొచ్చని ఈ సంవత్సరమే అనుమతించిన విషయం తెలిసిందే.

Exit mobile version