Site icon NTV Telugu

Shehbaz Sharif: దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు.. పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు

Shehbaz Sharif

Shehbaz Sharif

దీపావళి పురస్కరించుకుని హిందువులకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అసలు పాకిస్థాన్‌లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ నెటిజన్లు నిలదీశారు. పాకిస్థాన్‌లో హిందువులు హింసను ఎదుర్కొంటుంటే షెహబాజ్ షరీఫ్ పెట్టిన సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ఇంకొకరు ప్రశ్నించారు. ఇలా రకరకాలుగా పాకిస్థాన్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు.

ఇది కూడా చదవండి: Trump: శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం.. ట్రంప్ హెచ్చరిక

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పండుగ చీకటిపై వెలుగును.. చెడుపై మంచిని సూచిస్తుందని పేర్కొన్నారు. ‘‘దీపావళి వెలుగుతో ఇళ్లు, హృదయాలు ప్రకాశింపజేసినట్లుగా ఈ పండుగ చీకటిని పారద్రోలి.. సామరస్యాన్ని పెంపొందిస్తుంది. శాంతి, కరుణ, భాగస్వామ్య శ్రేయస్సు, భవిష్యత్ వైపు మనందరినీ నడిపించాలి.’’ అంటూ రాసుకొచ్చారు.

‘‘చీకటిపై వెలుగును.. చెడుపై మంచిని.. నిరాశపై ఆశను ప్రతిబింబించే దీపావళి స్ఫూర్తి. అసహనం నుంచి అసమానత వరకు మన సమాజాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలనే మన సమిష్టి సంకల్పానికి స్ఫూర్తినిస్తుంది.’’ అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Diwali Child Safety Tips: దీపావళి వేడుకల్లో పిల్లలు భద్రం.. బాంబుల శబ్దాలతో ప్రమాదం ఎంత?

అయితే షరీఫ్ పోస్ట్ చేయగానే నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువులు హింసను ఎదుర్కొంటున్న దేశంలో ప్రధాని సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ నెటిజన్లు నిలదీశారు. ఒక నెటిజన్ అయితే ఎగతాళి చేస్తూ ‘‘పాకిస్థాన్‌లో హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా?.’’ అంటూ నిలదీశాడు.

ఇది వంచన కాదా? అంటూ మరొకరు నిలదీశారు. పాకిస్థాన్ ప్రభుత్వం మైనారిటీలపై క్రమబద్ధమైన వివక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల సంఘటనలను గుర్తుచేశారు. ‘‘పహల్గామ్‌లో హిందువులను చంపిన తర్వాత దీపావళికి శుభాకాంక్షలు చెప్పడమేంటి?. సిగ్గులేని పాకిస్థాన్. హిందువులు, క్రైస్తవులు, సిక్కులను క్రమబద్ధంగా చంపి మతం మార్చారు… ప్రపంచంలోనే ఉగ్రవాద దేశం”. అంటూ ఇంకొకరు ధ్వజమెత్తారు.

 

 

Exit mobile version