నేపాల్ ప్రధాని బాలెన్ షా అధికారం చేపట్టాక తొలిసారిగా భారత పర్యటనకు రాబోతున్నారు. నవంబర్ 22,23 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించబోతున్నారు. ఆదివారం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో వేర్వేరుగా భేటీ కాబోతున్నారు. అయితే, ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానులకు ఆయన అరుదైన గిఫ్ట్‌లు తీసుకురాబోతున్నారు.
సంప్రదాయానికి భిన్నంగా బాలెన్ షా..
గతంలో నేపాల్ ప్రధానులు భారత పర్యటనకు వచ్చినప్పుడు సంప్రదాయబద్ధంగా పశుపతినాథ్ ఆలయ నమూనాలను బహుమతిగా ఇచ్చేవారు. అయితే, బాలెన్ షా మాత్రం ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత్-నేపాల్ దేశాల మధ్య ఉన్న శతాబ్ధాల నాటి చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాన్ని ప్రతిబింబించేలా రెండు విశిష్టమైన విగ్రహాలను తీసుకువస్తున్నారు.
ప్రధాని మోడీకి ‘రాతో మచ్చింద్రనాథ్’ విగ్రహం..
ప్రధాని నరేంద్ర మోడీడికి బాలెన్ షా ‘రాతో మచ్చింద్రనాథ్’ విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు. ఖాట్మాండు లోయ ప్రాంతంలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ దైవానికి భారత్‌తో విడదీయలేని సంబంధం ఉంది. నేపాల్ చరిత్ర, విశ్వాసాల ప్రకారం.. పూర్వం ఖాట్మాండు లోయ ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడుతున్న సమయంలో లిచ్చవి వంశపు రాజు నరేంద్ర దేశ్ ప్రస్తుతం అస్సాం ప్రాంతం నుంచి రాతో మచ్చింద్రనాథ్ను ఖాట్మాండుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత లోయలో సమృద్ధిగా వర్షాలు కరిశాయని, ప్రజల కష్టాలు తీరాయని నమ్ముతారు.
రాష్ట్రపతికి ‘‘చారుమతి విహార్’’..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఖాట్మాండు లోని చబహిల్ ప్రాంతంలో ఉన్న చారుమతి విహార్‌కు సంబంధించిన విగ్రహాన్ని నేపాల్ ప్రధాని అందించనున్నారు. ఈ బౌద్ధ విహారానికి మౌర్య చక్రవర్తి అశోకుడు, ఆయన కుమార్తె చారుమతితో సంబంధం ఉంది. చారిత్రక కథనాల ప్రకారం.. అశోకుడు తన కుమార్తె చారుమతితో కలిసి ఖాట్మాండు లోయను సందర్శించాడు. ఆ సమయంలో చారుమతి స్థానిక నేపాల్ యువరాజు దేవపాల్ను వివాహం చేసుకుని, దేపపటాన్లో స్థిరపడింది. ఆమె అక్కడే ఈ విహారాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
దౌత్యపరమైన ప్రాధాన్యత..
భారత్‌తో ఎన్నో ఏళ్ల సంబంధాల కారణంగా నేపాల్ ప్రధానులు అధికారం చేపట్టిన తర్వాత భారత పర్యటనకు రావడం ఆనవాయితీగా మారింది. భారత్ కూడా తన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానానికి ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే నేపాల్‌తో సంబంధాలు మరింత బలపడాలని కాంక్షిస్తోంది. బాలెన్ షా పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రెండు దేశాలు భావిస్తున్నాయి.
సరిహద్దు వివాదాలు..
భూపరివేష్టిత దేశమైన నేపాల్ వాణిజ్యం, రవాణా అవసరాల కోసం భారత్‌పై ఆధారపడుతుంది. ఇదిలా ఉంటే లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ సరిహద్దు వివాదాలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తున్నాయి . ఈ ప్రాంతాలు తమవే అని భారత్ వాదిస్తుంటే, తమ భూభాగాలు అని నేపాల్ వాదిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొద్దిగా ఉద్రిక్తత ఏర్పడింది. నేపాల్ ప్రధాని భారత పర్యటనకు వస్తుండటంతో ఈ వివాదాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

