Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్

  • నేపాల్‌లో కూలిన హెలికాప్టర్
  • మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Nepal

Nepal

నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. మృతదేహంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కాట్మాండు నుంచి ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హెలికాప్టర్‌లో తరలిస్తున్నారు. ఖోటాంగ్ జిల్లా కెపిలాస్‌గఢిలో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలు కాగా.. ఇతరులకు ఎలాంటి నష్టం జరగనట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరూ మరణించలేదని జిల్లా మేజిస్ట్రేట్ రేఖా కండెల్ మీడియాకు తెలిపారు.

ఇది కూడా చదవండి: Iran Execution: ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ గడ్డపై ఉరిశిక్ష

ప్రత్యేక మిషన్‌లో భాగంగా హెలికాప్టర్ మృతదేహాన్ని కాట్మాండు నుంచి ఖోటాంగ్‌కు తరలిస్తోంది. రోడ్డు, విమానాశ్రయ సౌకర్యాలు పరిమితంగా ఉండే నేపాల్ పర్వత ప్రాంతంలో ఇలాంటి ప్రయాణాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే హెలికాప్టర్‌లో మృతదేహాన్ని తీసుకొస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను నడపడం అత్యంత ప్రమాదకరం. ఇరుకైన లోయలు, ఆకస్మిక వాతావరణ మార్పులు, తాత్కాలిక ల్యాండింగ్ ప్రదేశాలు పైలట్లకు తీవ్రమైన సవాళ్లను విసురుతాయి. ఈ కారణంగానే నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.

అయితే తాజా ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదని అధికారులు అన్నారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపమా? లేదంటే పైలట్ తప్పిదమా? లేదంటే వాతావరణం కారణమా? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. సహాయక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను పరిశీలించారు. ప్రమాదం తీవ్రమైనదే అయినప్పటికీ ఎవరూ చనిపోకపోవడంతో ఊరట లభించింది.