యువత తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయంటారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వమే ఇందుకు నిదర్శనం. గతేడాది విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి.. రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్‌కు పారిపోయి వచ్చేశారు. తాజాగా నేపాల్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. దాదాపుగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూడా పతనం దిశగా వెళ్తోంది. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం కూలిపోనుంది. నిరసనకారుల దూకుడుతో భద్రతా దళాలు కూడా చేతులెత్తేశాయి.
ఇది కూడా చదవండి: Bollywood : పుత్రోత్సాహంతో పులకించిపోయేందుకు స్వయంగా రంగంలోకి దిగిన బాద్ షా
ప్రస్తుతం సమాజాన్ని సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. సోషల్ మీడియా లేకుండా రోజు గడవని పరిస్థితులున్నాయి. అన్నింటికీ సోషల్ మీడియానే ఆధారం అయింది. అలాంటి సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా 18 సామాజిక మాధ్యమాలపై కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ముఖ్యంగా యువతలో ఆగ్రహావేశాలు రప్పించింది. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Nepal Gen Z protest: అధ్యక్షుడి భవనంలో నిరసనకారుల విధ్వంసం.. మంత్రుల ఇళ్లు లక్ష్యంగా దాడులు
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ దాదాపు 10 వేల మంది నిరసనకారులు రాజధాని ఖాట్మండును ముట్టడించారు. ‘‘సోషల్ మీడియాపై నిషేధం కాదు.. అవినీతిపై నిషేధం విధించండి’’ అంటూ నినాదం ఎత్తుకున్నారు. ఒక దశలో పార్లమెంట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో భద్రతా దళాలు అడ్డుకునే క్రమంలో తుపాకులకు పని చెప్పారు. పోలీసుల కాల్పుల్లో 20 మంది చనిపోగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఇది మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసనకారులు మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు.
ఇక ఆందోళనలు ఉధృతం అవుతున్నాయని గ్రహించి సోమవారం రాత్రి ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసింది. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కర్ఫ్యూ విధించింది. కానీ అంతా రివర్స్ అయింది. కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా నిరసనకారులు మంగళవారం కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వ పెద్దల ఇళ్లులు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. వాహనాలకు నిప్పుపెట్టి.. ఇళ్లుపై రాళ్లు విసిరారు. అలాగే అధ్యక్షుడి భవనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇలా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు.
ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. ఇంకోవైపు కేపీ శర్మ ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేసి దుబాయ్‌కు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిమాలయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే వైద్యం కోసమే ప్రధాని దుబాయ్ వెళ్తున్నట్లుగా సన్నిహితుడు మీడియాకు చెప్పాడు. మరోవైపు ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారుల డిమాండ్‌కు తలొగ్గి ఓలి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే నేపాల్ ప్రభుత్వం కూలిపోనుంది. ఈ పరిణామాలను చూస్తుంటే.. గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకోవడమంటే ఇదేనేమో! అనిపిస్తోంది.
