Nepal Floods: నేపాల్ భోటెకోశి నది సృష్టించిన వరద విధ్వంసానికి మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 538 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. మరో 977 మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. నేపాల్, చైనాలోని టిబెల్ ప్రాంతాన్ని కలుపుకుంటే మరణాల సంఖ్య 543కు చేరింది. రెండు దేశాల్లో కలిపి దాదాపుగా 1500 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది.
నేపాల్‌లో వరద ప్రాంతాల్లో సహాయక, గాలింపు, రెస్క్యూ చర్యలను ముమ్మరం చేశారు. 14,000 మందికిపైగా భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు సుమారు 3742 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. 2015లో సంభవించిన భూకంపం తర్వాత నేపాల్ ఎదుర్కొంటున్న అత్యంత ప్రాణాంతక విపత్తుగా ఈ వరదలు నిలిచాయి. ఈ విపత్తుకు హిమానీనదం కూలిపోవడమే కారణమని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీగా మంచు, శిథిలాలు, నీరు ఒక్కసారిగా కిందకు ప్రవహించడంతో ఈ విపత్తు సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే, నేపాల్‌కు మరో ముప్పు పొంచి ఉంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో మరో సహజ సరస్సు ఉప్పొంగుతున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. సరస్సు నుంచి భారీగా నీరు గట్లపై నుంచి ప్రవహిస్తున్నట్లు చెప్పింది. చైనా సర్వే ప్రకారం, ప్రస్తుతం సరస్సులో 25 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా నీరు నిల్వ ఉంది. ఒక్కరోజు ముందు ఈ పరిమాణం సుమారు 15–20 లక్షల క్యూబిక్ మీటర్లుగా అంచనా వేశారు. దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎంత వేగంగా మారుతోందో తెలుస్తోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా గతంలో అంచనా వేసింది. ఇది దాదాపు 1,200 ఒలింపిక్-సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌కు సమానం. సరస్సు ఆనకట్ట తెగితే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం ముంచెత్తే అవకాశం ఉంది.

