17 people Killed heavy rains and Landslides in Nepal: హిమాలయ దేశం నేపాల్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా పడుతున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కొండచరియాలు విరిగిపడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నేపాల్ వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వానల కారణంగా దేశంలో 17 మంది మరణించారని అక్కడి అధికారులు శనివారం వెల్లడించారు.
ముఖ్యంగా నేపాల్ లోని సుదుర్‌పాస్చిమ్ ప్రావిన్స్‌లోని అచ్చం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు పడుతున్నాయి. ఈ జిల్లాలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాజధాని ఖాట్మాండుకు పశ్చిమాన 450 కిలోమీటర్ల దూరంలోని అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడి 17 మంది ప్రజలు మరణించారని తాత్కాలిక ముఖ్య జిల్లా అధికారి దీపేష్ రిజాల్ తెలిపారు. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారని.. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. చికిత్స నిమిత్తం వీరందరినీ విమానంలో సుర్ఖేత్ జిల్లాకు తరలించారు. ఇదిలా ఉంటే కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.
Read Also: China: భారత్, అమెరికా ప్రయత్నాలకు చైనా మోకాలడ్డు.. ముంబయి పేలుళ్ల సూత్రధారికి అండ!
తప్పిపోయిన వ్యక్తుల కోెసం నేపాల్ పోలీసులు గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారు తెలుపుతున్నారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల సుదుర్‌పాస్చిమ్ ప్రావిన్స్ లోని ఏడు జిల్లాలను కలిపే భీమ్ దుట్ట హైవే దెబ్బతింది. దీంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాలు దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వర్షాల వల్ల కరెంట్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. నేపాల్ పూర్తిగా హిమాలయాల్లో ఉండటంతో అక్కడ వర్షాకాలం ప్రమాదాలు తరుచుగా జరుగుతుంటాయి. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. ముఖ్యంగా నేపాల్ పర్వత ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వరదలు, కొండచరియలకు సంబంధించిన ప్రమాదాలు జరుగుతుంటాయి.
