Site icon NTV Telugu

Iran Protests: ఖమేనీని భయపెడుతున్న “కొత్త నినాదం”.. ఇరాన్‌లో భారీ నిరసనలు..

Iran

Iran

Iran Protests: ఇరాన్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’, ‘‘జావిద్ షా’’ నినాదాల తర్వాత ఇప్పుడు మరో నినాదం ఖమేనీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. శుక్రవారం నాటికి నిరసనలు ప్రారంభమై 13 రోజులకు చేరుకుంది. భారీ నిరసనల మధ్య ఖమేనీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపేసింది. ‘‘గాజా కాదు, లెబనాన్ కాదు, నా ప్రాణం ఇరాన్ కోసం’’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ఇస్ఫహాన్ ప్రావిన్సుల్లో ఆస్ఘరాబాద్‌లో ప్రజలు ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు.

ఖమేనీ పాలన గత కొంత కాలంగా గాజా, లెబనాన్ అనుకూల విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోంది. ముఖ్యంగా హమాస్, హిజ్బుల్లాలకు మద్దతు ఇస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజలు నినాదాలు చేస్తు్న్నారు. దేశంలో జీవన ప్రమాణాలు క్షీణిస్తుంటే.. గాజా, లెబనాన్‌లకు ఇరాన్ మద్దతు ఇస్తుండటంపై ఇరాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్, అమెరికాలకు వ్యతిరేకంగా భౌగోళిక, రాజకీయ లక్ష్యాల కోసం గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఇస్తోంది.

Read Also: Rajasaab : సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. “ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?” అంటూ..

ఇదే కాకండా, ప్రజలు గత రాజ పాలకులకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేస్తుండటం ఇప్పుడు ఖమేనీకి భయం కలిగించే పరిణామం. జవి ఖొరాసాన్ ప్రావిన్స్‌లోని మష్హద్ నగరంలో నిరసనకారులు ఇరాన్ జెండాను కూల్చేశారు. 1979లో ఖమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ విప్లవం తర్వాత అప్పటి వరకు ఇరాన్‌ను పాలించిన పహ్లావీ రాజవంశ పాలన కుప్పకూలింది. అయితే, ఇప్పుడు రాజవంశానికి మద్దతుగా నినాదాలు చేస్తుండటం గమనార్హం. రాచరికం పునరుద్ధరణ కోరుతూ నిరసనకారులు నినాదాలు చేశారు. మరోవైపు, ఈ నిరసనల్ని ఖమేనీ ప్రభుత్వం తీవ్రంగా అణిచివేయాలని చూస్తోంది. ఇప్పటి వరకు 45 మంది మరణించగా, 20,000 మందికి పైగా అరెస్టయ్యారు.

మరోవైపు, ఈ నిరసనల్ని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. అమెరికా ఈ సంఘటనల్ని నిశితంగా గమనిస్తోంది. ఇరాన్‌లో నిరసనకారుల్ని చంపేస్తే, బలమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని గద్దె దింపిన తర్వాత, ఇరాన్‌లో ఈ తరహా ఆపరేషన్ లేదా దాడులకు అమెరికా ప్లాన్ చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version