దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్‌ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్‌తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: నాసా కీలక పరిశోధన: అంగారకుడిపై నీటి జాడలు
ప్రపంచంలోని ఏ నిఘా సంస్థ చేయలేని పనిని పెగాసస్‌తో చేయవచ్చంటూ వివిధ దేశాల నిఘా సంస్థలకు ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్‌వో పెగాసస్‌ను అంటగట్టిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఎన్‌క్రిప్ట్ చేసిన సమాచారాన్నీ చోరీ చేసేలా దానిని రూపొందించిందని… 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారని, ఆ పర్యటనలోనే నాటి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో 200 కోట్ల డాలర్లతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని పేర్కొంది. మరికొన్నిరోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి పెగాసస్ వేడి రాజుకోవడంతో.. బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షాలు సజావుగా సాగనిస్తాయో లేదో వేచి చూడాలి.
