Site icon NTV Telugu

Artemis-1 Moon mission: మళ్లీ జాబిలిపైకి.. నేడు నాసా మానవ రహిత ఆర్టెమిస్‌-1 ప్రయోగం

Artemis 1 Moon Session

Artemis 1 Moon Session

Artemis-1 Moon mission: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపే నేడు తొలి అడుగు పడనుంది. ఆర్టెమిస్‌-1 మిషన్‌లో భాగంగా నేడు నాసా మూన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.చంద్రుడిపై మనిషి కాలుపెట్టి అర్ధశతాబ్దం దాటింది. తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్‌ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి మూన్ మిషన్‌కు ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని నాసా పేరు పెట్టింది. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది. చంద్రుడి మీదకు నాసా సిద్ధం చేసిన ఆర్టెమిస్‌-1ను ఇవాళ ప్రయోగించనున్నారు.

ఆర్టిమిస్‌-1 ద్వారా డమ్మి బొమ్మలను పంపి నాసా ఫలితాలను పరిశీలించనుంది. మరోవైపు ఆర్టిమిస్-2 మిషన్ 2024లో, ఆర్టిమిస్-3 మిషన్ 2025లో ఉండొచ్చని నాసా చెబుతోంది. 50 ఏళ్ల సుదీర్ఘం విరామం అనంతరం గతంలో లాగా నామమాత్రపు సందర్శనలతో సరిపుచ్చకుండా చందమామపై శాశ్వత ఆవాసాలు వేసేందుకు నాసా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. జాబిలిని చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు ఉండరు. తదుపరి ప్రయోగాలు మాత్రం మానసహితంగానే సాగనున్నాయి.

Pakistan: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. ఇప్పటి వరకు 1,033 మంది మృత్యువాత

వ్యోమగాములు ఉండే క్రూ కాప్స్యూల్, ఓరియాన్‌ను చంద్రుడి వెనుక కక్ష్యలోకి పంపించి.. అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు రప్పించటం, కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ సముద్రంలోకి పడేలా చేయటం ఈ ప్రయోగంలో నాసా శాస్త్రవేత్తల లక్ష్యం. 6 వారాల పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఓరియాన్ కాప్స్యూల్‌ హీట్‌షీల్డ్.. భూమి మీదకు తిరిగి ప్రవేశించేటపుడు ఆ వేడిని తట్టుకోగలదా లేదా అన్నది పరీక్షించటం ఈ ప్రయోగంలో ఒక ప్రధాన ఉద్దేశం. 2024లో ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా వ్యోమగాములను నాసా చంద్రుని కక్ష్యలోకి పంపనుంది. ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా మళ్లీ మనుషులు చంద్రుడు మీద దిగుతారని తెలిపింది. ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా చంద్రుడి మీద తొలి మహిళ పాదం మోపుతారని నాసా ఇప్పటికే హామీ ఇచ్చింది.

Exit mobile version