NTV Telugu Site icon

Boeing Starliner: స్టార్‌లైనర్ నుంచి వింత శబ్ధాలు.. అసలు భూమికి తిరిగి వస్తుందా..?

Starliner

Starliner

Boeing Starliner: బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు నాసాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్టార్‌లైనర్‌లో జూన్ 5న 8 రోజుల అంతరిక్ష ప్రయోగంలో భాగంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లారు. అయితే, స్టార్ లైనర్ క్యాప్సూల్ అంతరిక్షానికి చేరగానే వరసగా దాంట్లో అంతరాయాలు మొదలయ్యాయి. హీలియం లీకేజీలతో పాటు థ్రస్టర్లు విఫలమయ్యాయి. వీటిని సరిచేసేందుకు గ్రౌండ్ కంట్రోల్‌తో పాటు అక్కడ వ్యోమగాములు ఎంతో ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. మరోవైపు వ్యోమగాములు ఇద్దరూ స్టార్‌లైనర్‌లో సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ క్రూ-9 ద్వారా వీరిని తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది.

Read Also: PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..

మరోవైపు సెప్టెంబర్ 6న వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్‌ని ఐఎస్ఎస్ నుంచి భూమిపైకి తీసుకురావాలని నాసా సన్నాహలు చేస్తోంది. ఇదిలా ఉంటే, మరోసారి స్టార్‌లైనర్‌తో నాసాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్‌తో ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింత శబ్ధాలు వస్తున్నట్లు వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన ఈ విషయాన్ని హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌‌తో చెప్పారు. స్పేస్ క్యాప్యూల్‌ని బయట నుంచి ఎవరో తడుతున్నట్లు, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్ధాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు.

స్టార్‌లైనర్ అంతర్గత స్పీకర్‌ని తన ఫోన్ వద్ద పెట్టి ఈ శబ్ధాలను భూమిపై నాసా శాస్త్రవేత్తలకు కూడా వినిపించారు. అయితే, ఈ శబ్ధాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే విషయం అర్థం కావడం లేదు. ఈ శబ్ధాల గురించి తెలుసుకునేందుకు పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతున్నట్లు నాసా చెప్పింది. విద్యుదయాస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్ధాలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఇన్ని సమస్యల మధ్య స్టార్‌లైనర్ సురక్షితంగా భూమిని చేరుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమికి చేరే ప్రక్రియలో ఏదైనా లీకేజీ, సాంకేతిక సమస్యతో రీ-ఎంట్రీ దశలో కూలిపోతుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Show comments