Myanmar junta beheads high school teacher: మయన్మార్ దేశంలో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. మానవహక్కులను ఉల్లంఘిస్తోంది అక్కడి జుంటా ప్రభుత్వం. సైనిక పాలకులకు ఎదురుతిరిగినా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా.. నిర్ధాక్షిణ్యంగా చంపేస్తోంది. ఇప్పటికే అనేక ఆరోపణపై ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాంగ్ సూచీని జైలులో నిర్భంధించింది సైన్యం. తమకు వ్యతిరేకంగా ఉంటే దారుణంగా చంపేస్తోంది.
ఇదిలా ఉంటే మరోసారి అక్కడి సైనిక పాలకులు అరాచకానికి పాల్పడ్డారు. సైనిక పాలనను వ్యతిరేకించినందుకు ఉపాధ్యాయుడి తల నరికేశారు. మయన్మార్ గ్రామీణ ప్రాంతం అయిన మాగ్వే ప్రాంతంలో తౌంట్ మైంట్ గ్రామంలో 46 ఏళ్ల సా తున్ మో అనే గణిత ఉపాధ్యాయుడి తల నరికేసి, మృతదేహాన్ని పాఠశాల గేటు ముందు ప్రదర్శించారు. తలను గేటుకు వేలాడదీశారు. గతేడాది మూతపడిన ఈ పాఠశాలను కాల్చేశారు. అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ స్పందించారు. బహిరంగంగా ఒక ఉపాధ్యాయుడి తల నరకడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
Read Also: Brahmastra 2 : ‘బ్రహ్మాస్త్ర 2’ ను నిర్మిస్తామంటూ ముందుకొచ్చిన డిస్నీ
గతేడాది ఫిబ్రవరిలో మయన్మార్ లో సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. రాజధాని నేపితాను ఆధీనంలోకి తీసుకుని ఆంగ్ సాంగ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులను జైల్లలో నిర్భంధించారు. 2300 మంది పౌరులను చంపినట్లు సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. సైన్యం పాలనను వ్యతిరేకించిన వారిని దారుణంగా అణిచివేసింది. సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ విద్యా సిబ్బందిపై 260 దాడులు జరిగాయని యూఎన్ బాలల హక్కుల కమిటీ వెల్లడించింది. హత్యకు గురైన సా తున్ మో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఆదివారం ఆయన స్థానికంగా ఉన్న వేరుశెనెగ పంటలో దాక్కున్నా సైన్యం వదిలిపెట్టకుండా వెతికిపట్టుకుని మరీ చంపింది
