NTV Telugu Site icon

Earthquakes: 1000కి చేరిన మయన్మార్, బ్యాంకాక్ భూకంప మృతుల సంఖ్య

Myanmarbangkokearthquake

Myanmarbangkokearthquake

మయన్మార్, బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న భూకంపాలు కారణంగా 1000 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని అనుమానిస్తు్న్నారు. ఇక థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం మయన్మార్ రాజధాని నేపిడా నుంచి 250 కి.మీ దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి 16 కి.మీ దూరంలో ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్‌, థాయ్‌లాండ్ దేశాలు గజగజ వణికిపోయాయి.

ఇది కూడా చదవండి: Jatadhara : ‘జటాధర’ షూటింగ్‌పై సోనాక్షి అప్డేట్

మయన్మార్‌లోని మండలేలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తుండగా కూలిపోయింది. అలాగే ఒక విశ్వవిద్యాలయ భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కూడా పలువురు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మయన్మార్ జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా ముందుకు రావాలని కోరారు. అలాగే ఉత్తర థాయిలాండ్‌లో కూడా భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలు నిలిపివేశారు. ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారిక పర్యటనను రద్దు చేసుకుని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: CSK vs RCB: 6155 రోజుల తర్వాత చెపాక్‌లో ఆర్సీబీ విజయం..

ఇక థాయిలాండ్, మయన్మార్‌తో పాటు చైనా, బంగ్లాదేశ్, భారత్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో బలమైన ప్రకంపనలు సంభవించాయని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ తెలిపింది. అలాగే భారత్‌లోని కోల్‌కతా, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌లోని ఢాకా, చట్టోగ్రామ్‌లో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. ఇక్కడ ఎలాంటి మరణాలు సంభవించలేదు.

ఇక ప్రధాని మోడీ.. మయన్మార్, థాయిలాండ్ భూకంపాలపై ఆరా తీశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అలాగే యూరోపియన్ దేశాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి.

బ్యాంకాక్‌లోని చతుచక్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ఆకాశహర్మ్యం కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉప ప్రధాన మంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్ వివరాల ప్రకారం 84 మంది కార్మికులు చిక్కుకున్నారని తెలిపారు. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది.