Site icon NTV Telugu

Bangladesh: ఇబ్బందుల్లో మహ్మద్ యూనస్.. ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితి..?

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజధాని ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించింది. ఇది తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది. ఢాకాలో ఎప్పుడూ లేని విధంగా సైన్యం మోహరించడం చూస్తే ఏదో జరగబోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లా సైన్యం, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలు మోహరించబడ్డాయి. వీటికి అదనంగా రాజధాని ఢాకాలో భద్రతను పటిష్టం చేయడానికి సమీప జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని సమీకరించారు. అయితే, ఇలా ఈ బలగాల మోహరింపు హిజ్బుత్-తహ్రీర్, ఇతర ప్రతిపక్ష గ్రూపులు పిలుపునిచ్చిన నిరసనల్లో ఎలాంటి హింస జరగకుండా నిరోధించడానికి అని పైకి చెబుతున్నారు.

Read Also: Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు..

అయితే, బంగ్లా దేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఇచ్చిన ఉత్తర్వు మాత్రం సందేహాలను మరింగతగా పెంచుతోంది. వకార్ రెండు కీలకమైన సైనిక కంటోన్మెంట్ల నుంచి దళాల కదలికలను ఆదేశించారు. రాబోయే కొద్ది రోజుల్లో సాయుధ వాహనాలు, సైనికులు ఢాకా చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటైల్ కంటోన్మెంట్ పూర్తి హై అలర్ట్‌లో ఉంచారు. ఇది చూస్తే, సైన్యం నిరసనల నియంత్రణ కన్నా పెద్ద చర్యకు సిద్ధమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భారత్‌‌తో సన్నిహిత సంబంధాలు, షేక్ హసీనాతో బంధుత్వం ఉన్న ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి మహ్మద్ యూనస్‌తో పడటం లేదని తెలుస్తోంది. యూనస్ ఇస్లామిక్ శక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పాకిస్తాన్‌తో చెలిమి చేయడం ఆర్మీ చీఫ్‌కి నచ్చడం లేదు. పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఒక సైనిక జనరల్ సైన్యంలో తిరుగుబాటు తెచ్చి వకార్‌ని దించాలనే ప్రయత్నం చేయడం వంటి అంశాలు కూడా వకార్‌ని అలర్ట్ చేశాయి. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై అణచివేత చర్యల్ని ఆయన వ్యతిరేకించారు. మహ్మద్ యూనస్‌‌కి బలమైన సందేశం ఇవ్వడానికి సైన్యాన్ని కదిలించినట్లు తెలుస్తోంది.

Exit mobile version