NTV Telugu Site icon

Afghanistan: అఫ్గాన్‌ మసీదులో ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి

Afghanistan

Afghanistan

Afghanistan: అఫ్గానిస్థాన్ మరోసారి బాంబుదాడులతో హోరెత్తింది. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ పట్టణంలో ఓ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 18 మంది మృతి చెందగా.. 23 మంది గాయపడ్డారు. మృతుల్లో ప్రముఖ మత గురువు ముజీబ్ ఉర్ రెహ్మాన్ అన్సారీ కూడా ఉన్నారని తాలిబన్ అధికారులు వెల్లడించారు. బాంబు దాడికి పాల్పడిన నిందితులను శిక్షిస్తామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.

హెరాత్‌లోని గుజర్గా మసీదు.. అఫ్గాన్‌లోని అతిపెద్ద మసీదుల్లో ఒకటి. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సందర్భంగా రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో మసీదు ప్రాంగణం రక్తసిక్తంగా మారింది. ఎక్కడికక్కడ మృతదేహాలు చెల్లచెదురుగా పడ్డాయని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఇప్పటివరకు దాదాపు 18 మంది మృతదేహాలను, 23 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు. గతేడాది తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మసీదులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఘటనలు జరగడం గమనార్హం.

Colombia: పోలీసు వాహనంపై బాంబు దాడి.. 8 మంది అధికారులు మృతి

“ముజీబ్ రెహ్మాన్ అన్సారీ తన కాపలాదారులు, పౌరులతో కలిసి మసీదు వైపు వెళుతుండగా చంపబడ్డారు” అని హెరాత్‌ పోలీసు అధికారి మహమూద్ రసూలీ తెలిపారు. ఆత్మాహుతి బాంబర్లలో ఒకరు తన చేతులను ముద్దుపెట్టుకుంటూ తనను తాను పేల్చేసుకున్నాడని తెలిపారు