NTV Telugu Site icon

Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత నగరంపై బాంబుల వర్షం.. బాలిక సహా ఆరుగురు మృతి

Russia Attacks Ukraine

Russia Attacks Ukraine

Moscow Attacks Zelensky Hometown After He Said War Had Returned To Russia: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ సొంత నగరమైన క్రివ్యి రిహ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ ఎదురుదాడులను నిర్వీర్యం చేసే క్రమంలోనే.. రష్యా సోమవారం ఈ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో పదేళ్ల బాలికతో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందగా.. 75 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక అపార్ట్‌మెంట్‌తో పాటు యూనివర్సిటీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని రెస్క్యూ ఆపరేషన్‌తో బయటకు తీస్తున్నారు. రష్యా చేసిన ఈ దాడులపై ఉక్రెయిన్ అంతరంగిక మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. పౌర నివాసాలపై దాడి చేయకూడదనే సాంప్రదాయం ఉన్నప్పటికీ.. రష్యా దాన్ని ఉల్లంఘించిందని, అపార్ట్‌మెంట్లపై విరుచుకుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. రష్యా వాదన మాత్రం మరోలా ఉంది. తాము కేవలం ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నట్టు రష్యా తెలిపింది.

Kyota Hattori Joker: రియల్ ‘జోకర్’ పాపం పండింది.. 23 ఏళ్ల జైలు శిక్ష

కాగా.. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాల్ని తిరిగి పొందేందుకు ఉక్రెయిన్ ఇటీవల తన దాడుల్ని ఉధృతం చేసింది. నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలతో రష్యాపై విరుచుకుపడుతోంది. ఆదివారం మాస్కోపై డ్రోన్ దాడులకి తెగపడింది. ఈ దాడి చేసిన మరుసటి రోజు.. జెలెన్‌స్కీ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. రష్యాకు యుద్ధం తిరిగి వస్తోందని హెచ్చరించారు. ఈ యుద్ధం క్రమేపీ రష్యా భూభాగంలోకి వెళ్తోందని.. ఇది తప్పనిసరైన, సహజమైన, సముచితమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. మరోవైపు.. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సైతం జెలెన్‌స్కీ వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్‌ సైన్యంలోని అశక్తత రోజురోజుకూ బయటపడుతోందని, నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేక పోతోందని చెప్పారు. ఓవైపు ఈ యుద్ధం ఆపేందుకు ఇతర దేశాలు ప్రయత్నిస్తుంటే.. ఉక్రెయిన్, రష్యా మాత్రం పరస్పర దాడులతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి.