Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని 75కు పైగా దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది, వైరస్ వ్యాప్తిని ఆపడానికి వేగవంతమైన చర్య కోసం పలు దేశాలు డబ్ల్యూహెచ్‌వోను విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటితే బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టీకాలు వేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలు, టీకాల గురించి తెలుసుకుందాం.
లక్షణాలు: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, దద్దుర్లు, అలాగే వాపు, బాధాకరమైన శోషరస కణుపులు మంకీపాక్స్ సోకిన వ్యక్తిలో తొలి లక్షణాలుగా గుర్తించవచ్చు. జ్వరం కనిపించిన దాదాపు ఒకటి నుంచి మూడు రోజుల తర్వాత, దద్దుర్లు ద్రవంతో నిండిన చర్మ గాయాలుగా మారవచ్చు. కొన్ని రోజులు లేదా వారాల తర్వాత గాయాలు లేదా పుండ్లు పడిపోవడానికి ముందు మచ్చలుగా మారుతాయి. మంకీపాక్స్ మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో చాలాకాలంగా ఉంది. మే నెల నుంచి ఇతర దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. జననేంద్రియాలు, మలద్వారం చుట్టూ, అలాగే నోటిపై గాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే రోగుల మధ్య లక్షణాలు మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల మధ్య ఉంటాయి. దద్దుర్లు పూర్తిగా నయం అయ్యే వరకు వైరస్ అంటుకుంటుంది.
Monkeypox: జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
వ్యాధి నిర్ధారణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. చాలావరకు కేసులు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో ఉన్నాయి. వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, సంపర్కం, కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే, కేసులు ఎక్కువ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నవే. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది. గత వారం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. సోకిన వారిలో 98 శాతం మంది స్వలింగ సంపర్కులు లేదా ద్విలింగ పురుషులు. 95 శాతం కేసులు లైంగిక కార్యకలాపాల ద్వారా సంక్రమించాయి. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను పోలి ఉండే అస్థిరమైన లక్షణాల కారణంగా వైరస్‌ని నిర్ధారించడం కష్టంగా ఉంటుందని పలువురు ఆరోగ్య అధికారులు హెచ్చరించారు.డబ్ల్యూహచ్‌వో ప్రకారం.. యూరప్ వ్యాప్తికి కేంద్రంగా ఉంది. నగరాల్లో నివసిస్తున్న యువకులలో అనేక కేసులు ఉన్నాయి. మంకీపాక్స్ కేసును నిర్ధారించడానికి పీసీఆర్ పరీక్ష లేదా చర్మ గాయం యొక్క నమూనా లేదా బయాప్సీ అవసరం కావచ్చు. సంభావ్య కేసులు ఉన్నవారు పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒంటరిగా ఉండాలి. వైరస్ నిర్ధారణ అయిన తర్వాత, మూడు వారాల పాటు ఐసోలేషన్ సిఫార్సు చేయబడింది. మంకీపాక్స్ వీర్యంలో కనుగొనబడింది, కానీ లైంగికంగా సంక్రమించే వ్యాధిగా పరిగణించబడదు. సన్నిహిత శారీరక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ కోలుకున్న తర్వాత 12 వారాల పాటు కండోమ్‌ను ఉపయోగించమని సిఫార్సు చేస్తోంది.
చికిత్స: వ్యాధి సాధారణంగా రెండు నుంచి మూడు వారాల తర్వాత స్వయంగా నయం అవుతుంది. కొన్నిసార్లు ఒక నెల పడుతుంది. అనేక సందర్భాల్లో, జ్వరాన్ని తగ్గించడం లేదా దురదను ఉపశమనం చేయడం వంటి లక్షణాలను పరిష్కరించడం మాత్రమే చికిత్స అవసరం. కొన్నిసార్లు గాయాలు చాలా బాధాకరంగా మారవచ్చు. అయినప్పటికీ, తీవ్రమైన నొప్పి నివారణ మందులు లేదా ఆసుపత్రి చికిత్స కూడా అవసరం. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తక్కువ రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉన్న వ్యక్తులలో అత్యంత తీవ్రమైన కేసులు కనిపించాయి. యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు.మంకీపాక్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు గాయాలను గీసుకోవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే దీనిద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది లేదా అది మచ్చగా మారుతుంది. మంకీపాక్స్ చికిత్స కోసం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ టెకోవిరిమాట్ అనే మశూచి ఔషధాన్ని ఆమోదించింది.
Monkeypox: గాలి ద్వారా మంకీపాక్స్ సోకదు.. అలాచేస్తేనే సోకే అవకాశం వుంది..?
టీకాలు: డానిష్ మందుల తయారీదారు అయిన బవేరియన్ నార్డిక్ నుంచి మశూచి వ్యాక్సిన్.. యునైటెడ్ స్టేట్స్‌లో జిన్నెయోస్, ఐరోపాలో ఇమ్వానెక్స్ పేరుతో విక్రయించబడింది. యూరోపియన్ కమిషన్ మంకీపాక్స్ కోసం దాని మశూచి వ్యాక్సిన్ ఉపయోగాన్ని సోమవారం ఆమోదించింది. ఈసీడీసీ ప్రకారం.. మంకీపాక్స్ వ్యాధికి గురైన నాలుగు రోజులలోపు ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే దాని ప్రభావం ఎక్కువగా ఉండి త్వరగా నయం అవుతుందని గుర్తించారు. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నవారికి టీకాలు వేయడం ప్రారంభించాయి. టీకా రెండు మోతాదులలో ఇవ్వబడుతుంది. రెండు డోసుల మధ్య కనీసం 28 రోజుల తేడా ఉంటుంది. కానీ చిన్నతనంలో మశూచికి వ్యతిరేకంగా టీకాలు వేసిన వారికి, ఒక మోతాదు సరిపోతుంది. తక్కువ రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉన్న వ్యక్తులకు మూడవ మోతాదు సిఫార్సు చేయబడింది. టీకాలు తక్షణం లేదా పూర్తి రక్షణను అందించవు కాబట్టి, ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆరోగ్య అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. యునైటెడ్ స్టేట్స్ కూడా పాత తరం ఏసీఏఎం2000 మశూచి వ్యాక్సిన్ అనేక మోతాదులను కలిగి ఉంది, అయితే ఇది ముఖ్యమైన దుష్ప్రభావాల కారణంగా అందరికీ సిఫార్సు చేయబడదు.