Site icon NTV Telugu

Monkeypox: గ్లోబల్ ఎమర్జెన్సీగానే మంకీపాక్స్.. డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం

Monkeypox

Monkeypox

Monkeypox still a global health emergency, says WHO: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించింది. ఎమర్జెన్సీ కమిటీ మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని మంగళవారం నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రస్తుతం దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నారు. మంకీపాక్స్ కట్టడికి ప్రపంచ దేశాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అత్యవసర కమిటీ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అథనామ్ ఘెబ్రేయేసస్ స్వాగతించారు.

Read Also: T20 World Cup: నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా కీలక మ్యాచ్.. వరుణుడు సహకరిస్తాడా?

అమెరికాతో పాటు ఆఫ్రికా దేశాల్లో వ్యాధి క్షీణతలో పురోగతి తక్కువగానే ఉందని.. కొన్ని దేశాల్లో వ్యాధికి సంబంధించి కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అమెరికాలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని.. ఐరోపా ప్రాంతంలో వ్యాధి తీవ్రత అధిక స్థాయి నుంచి మధ్యస్థ స్థాయికి క్షీణించిందని..ఆఫ్రికా, తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియాలోని దేశాల్లో మంకీపాక్స్ తీవ్రత మధ్యస్థంగా ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకు 100 దేశాల్లో 70,000 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. పురుషుల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.

ఈ ఏడాది మే నెలలో బ్రిటన్ లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు యూరప్ లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. బ్రిటన్ తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70,000 కేసులు నమోదు అయితే..29 మంది మరణించారు. ఎక్కువగా స్వలింగసంపర్కుల్లో ఈ వ్యాధి వ్యాపించింది. 90 శాతం కేసులకు పురుషుల్లో స్వలింగ సంపర్కమే కారణం అని తెలుస్తోంది.

Exit mobile version