Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్

  • ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలు
  • మొజ్తబా ఖమేనీ వీడియో క్లిప్‌ను ఇరాన్ విడుదల చేసింది
  • ఇరాన్ అధ్యక్షుడు ఏం చెప్పారు?
Untitled 1

Untitled 1

Mojtaba Khamenei health: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్య పరిస్థితిపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య ఇరాన్ మీడియా ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ 12 సెకన్ల వీడియోలో మొజ్తబా ఖమేనీ తన సలహాదారులు, అధికారులతో సమావేశంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ ఆరోగ్యంగా కనిపించడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో దేశ వ్యూహంపై అధికారులతో ఆయన చర్చిస్తున్నట్లు వీడియోను ఇరాన్ మీడియా వివరించింది.

ఆరోగ్యంపై భిన్నమైన నివేదికలు

మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇటీవల కొన్ని ఇజ్రాయెలీ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. కొన్ని నివేదికలు ఆయన పరిస్థితి మరింత విషమిస్తే కొద్ది రోజుల్లోనే మరణించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నాయి. అయితే ఈ వాదనలకు స్వతంత్రంగా ధృవీకరణ లభించలేదు. మరోవైపు ఇరాన్ మీడియా విడుదల చేసిన తాజా వీడియో ద్వారా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను ఖండించే ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రజల ముందుకు ఎందుకు రావడం లేదు?

56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ చాలా కాలంగా బహిరంగంగా కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఇరాన్‌లో నాయకత్వ మార్పు అనంతరం కూడా ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ముఖ్యమైన సందర్భాల్లో ప్రజల ముందుకు రాకపోవడం కారణంగా ఆయన ఆరోగ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే భద్రతా కారణాల వల్ల ఆయన బహిరంగంగా కనిపించడం లేదనే వాదనలు కూడా ఉన్నాయి.

ఇరాన్ అధ్యక్షుడు ఏం చెప్పారు?

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇటీవల మొజ్తబా ఖమేనీతో కమ్యూనికేట్ చేయడం ప్రస్తుతం “చాలా కష్టంగా ఉంది” అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన నాయకత్వం దేశానికి బలాన్నిస్తోందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఖమేనీ దేశ పరిపాలన, కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నారని గతంలో పేర్కొన్నాయి.

రహస్య ప్రదేశంలో సమావేశం జరిగిందా?

ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం.. పెజెష్కియాన్, ఖమేనీని ఒక రహస్య ప్రదేశంలో కలిసినట్లు పేర్కొన్నారు. ఆ సమావేశం టెహ్రాన్‌లో జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆ కథనం ప్రకారం.. పెజెష్కియాన్‌ను కారు వెనుక సీటులో ఉన్న వ్యక్తి వద్దకు తీసుకెళ్లారని, కారు అద్దాలు నల్లగా ఉండటంతో ఆయనను స్పష్టంగా చూడలేకపోయారని పేర్కొంది. ఆ వ్యక్తి తానే మొజ్తబా ఖమేనీ అని చెప్పుకున్నప్పటికీ, పెజెష్కియాన్‌కు పూర్తిగా నమ్మకం కలగలేదని నివేదిక పేర్కొంది. అయితే ఈ వివరాలు స్వతంత్రంగా ధృవీకరించలేదు.