బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 212 స్థానాలు కైవసం చేసుకున్నట్లు బీఎన్‌పీ ప్రకటించింది. ఇక జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ 70 సీట్లకు పరిమితం అయింది. ఇక బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ నేపథ్యంలో తారిక్ రెహమాన్‌కు, బీఎన్‌పీ పార్టీకి ప్రధాని మోడీ శుభకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీని నిర్ణయాత్మక విజయం వైపు నడిపించినందుకు తారిఖ్ రెహమాన్‌ను అభినందించారు. ఈ ఫలితం బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని, ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారతదేశం మద్దతు ఇస్తుందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు.
తారిక్ రెహమాన్..
తారిక్ రెహమాన్.. బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ ఖలీదా జియా కుమారుడు. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఇక 17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమాన్ లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు. సమయం తక్కువగా ఉన్న ప్రచారంలో దూసుకుపోయారు. ప్రజలు సుస్థిరమైన పాలనకు ఓటేశారు.
ఆగస్టు, 2024లో విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యమని తారిక్ రెహమాన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
