NTV Telugu Site icon

Modi-Biden: యూఎస్ ఇండియా మధ్య ద్వైపాక్షిక సమావేశం

Modi Biden

Modi Biden

భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ టోక్యో వెళ్లిన మోదీ వరసగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దేశాధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా క్వాడ్ సమ్మిట్ ముగిసిన తర్వాత మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో సమావేశం అయ్యాయి. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర విశ్వాస భాగస్వామ్యం అని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం నమ్మకంతో కూడిందని ఆయన అన్నారు.

ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ తో పాటు ఇరు దేశాల అధికారులు పాల్గొన్నారు. చర్చల సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిణామాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంతో చైనా విఫలం అయిందని.. అదే సమయంలో భారత్ విజయం సాధించిందని జో బైడెన్ కొనియాడారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఇండియా కోవిడ్ ను కంట్రోల్ చేసిందని ఆయన అన్నారు. మోదీ విజయం ప్రజాస్వామ్య దేశాల్లో నమ్మకం నింపిందని.. చైనా, రష్యా వంటి నిరంకుశ ప్రభుత్వాలు మెరుగైన పాలనను అందిస్తాయనే అపోహాను చేధించాయి అని అన్నారు.

తాజాగా క్వాడ్ లీడర్ల మధ్య ఇది నాలుగో భేటీ. గతేడాది సెప్టెంబర్ లో అమెరికా వాషింగ్టన్ వేదికగా సమావేశాలు జరిగాయి. క్వాడ్ సమ్మిట్ లో ప్రధానంగా నేతలంతా ఇండో-పసిఫిక్ రీజియన్ లో శాంతి, భద్రత, వాణిజ్యం, వ్యాపారం గురించి చర్చించారు. అంతరిక్షం, వాతావరణ మార్పు, ఆరోగ్యం, సైబర్ భద్రత వంటి అంశాల్లో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా చేస్తున్న దురాక్రమణను సమర్థంగా ఎదుర్కొనేందుకు జపాన్, ఆస్ట్రేలియా,ఇండియా, యూఎస్ఏ లు కలిసి క్వాడ్ పేరిట కూటమిని ఏర్పాటు చేశాయి.

Show comments