NTV Telugu Site icon

Bangladesh: పాక్‌తో కలిసి బంగ్లా ఆర్మీలో సైనిక కుట్ర.. కీలక సైనిక జనరల్‌పై నిఘా..

Bangladesh Coup

Bangladesh Coup

Bangladesh: షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి. ముఖ్యంగా, పాకిస్తాన్‌తో కలిసి బంగ్లా ఆర్మీ చీఫ్‌ని మార్చడం లేదా ఆర్మీలో తిరుగుబాటు తేవడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. క్వార్టర్ మాస్టర్ జనరల్(QMG) అయిన లెఫ్టినెంట్ జనరల్ ఫైజుర్ రెహమాన్ కొన్ని రోజులుగా ఇందుకు కుట్ర పన్నుతున్నారనే వార్తలు వచ్చిన తర్వాత అతడిపై బంగ్లాదేశ్ ఆర్మీ నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆమోదించినట్లు తెలుస్తోంది.

మతఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామికి సానూభూతిపరుడైన లెఫ్టినెంట్ జనరల్ ఫైజుర్ రెహమాన్, ఆర్మీ చీఫ్‌కి తెలియకుండానే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చీఫ్ సెక్రటేరియట్‌లో వార్తలు వచ్చిన తర్వాత అతడిపై నిఘాలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ యాక్టింగ్ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు డివిజనల్ కమాండర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అతడికి తగినంత మద్దతు లభించలేదు.

Read Also: SSMB-29: హనుమంతుడి స్ఫూర్తితో ఎస్ ఎస్ ఎంబీ-29 కథ.. అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్..?

మార్చి మొదటి వారంలో లెఫ్టినెంట్ జనరల్ ఫైజుర్ రెహమాన్ కీలకమైన డివిజనల్ కమాండర్ల (జిఓసి) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆర్మీ చీఫ్ సెక్రటేరియట్ సమావేశం గురించి తెలుసుకుని ఉన్నతాధికారులకు హెచ్చరిక పంపబడింది. దీంతో ఉన్నతాధికారులు కీలకమైన సమావేశం నుంచి వెనక్కి తగ్గారు. 2025 మొదటి రెండు నెలల్లో లెఫ్టినెంట్ జనరల్ ఫైజుర్ రెహమాన్ జమాత్, పాకిస్తాన్ దౌత్యవేత్తలతో అనేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల గురించి ఆర్మీ ఛీప్‌కి సమాచారం లేదు. ఇటీవల పాక్ ఐఎస్ఐ చీఫ్‌ బంగ్లాకు వచ్చిన సమయంలో కూడా ఫైజుర్ రెహమాన్‌నే వీరిని దగ్గర ఉండి చూసుకున్నారు.

గత కొన్ని నెలలుగా హింస, మత ఘర్షణలు, అల్లర్లు పెరుగుతున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో మళ్లీ అశాంతి చెలరేగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల షేక్ హసీనా కుటుంబంతో సంబంధం ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వీరిలో బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పబడుతున్న షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు కూడా ఉంది. గత నెలలో, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ మాట్లాడుతూ, దేశంలో శాంతిభద్రతల పరిస్థితి వేగంగా దిగజారడానికి రాజకీయ గందరగోళమే కారణమని అన్నారు. సాయుధ దళాలలో ఐక్యత, క్రమశిక్షణ అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. ‘‘మనం చూస్తున్న అరాచకం మనమే సృష్టించుకున్నాం’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.