Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!

  • షేక్ హసీనాకు ఏదైనా జరిగితే తారిఖ్ రెహ్మన్‌దే బాధ్యత..
  • బంగ్లాదేశ్ ప్రధానికి అమెరికా మాజీ రక్షణ అధికారి వార్నింగ్..
Hasina

Hasina

Sheikh Hasina: పదవీచ్యుతురాలైన షేక్ హసీనా డిసెంబర్ 16న తన సొంత దేశం బంగ్లాదేశ్ వెళ్తున్నట్లు ప్రకటించింది. 2024 ఆగస్టులో హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె భారత్ వచ్చారు. రెండేళ్లుగా భారత్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వచ్చే నెల ఆమె బంగ్లాదేశ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఆ దేశంలో షేక్ హసీనా మద్దతుదారులు, అవామీలీగ్ కార్యకర్తలు తమ అధినేత రాక కోసం ఎదురుచూస్తు్న్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఘర్షణలు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ వెళ్లిన తర్వాత షేక్ హసీనాకు ఏదైనా హాని జరిగితే అందుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్) మాజీ అధికారి మైఖేల్ రూబిన్ హెచ్చరించారు. హసీనా విషయంలో భారత్ ఎలాంటి రాజీ పడకూడదని కూడా ఆయన సూచించారు. న్యూయార్క్‌లో జరిగిన ‘‘బంగ్లాదేశ్ ఫ్యూచర్’’ అనే సదస్సులో మైఖేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన 2002 నుంచి 2004 వరకు పెంటగాన్‌లో పనిచేశారు. హసీనా తల నుంచి ఒక్క వెంట్రుకకు హాని జరిగినా అందుకు బాధ్యత తారిఖ్ రెహ్మన్‌తో పాటు ఆయన ప్రభుత్వమే అని అన్నారు.

మరోవైపు, హసీనా రాకపై బంగ్లాదేశ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఇన్నాళ్లు బంగ్లాదేశ్‌ హసీనాను పంపించాలని భారత్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇప్పుడు స్వయంగా ఆమె బంగ్లాదేశ్ వస్తానని చెబితే, ఆమె సాధారణ ప్రయాణికురాలిగా రావడానికి వీల్లేదని, నేరస్తుల్లా ‘‘అప్పగింత ప్రక్రియ’’ ద్వారా మాత్రమే రావాలని బంగ్లా విదేశాంగ సహాయమంత్రి హుమాయున్ కబీర్ వ్యాఖ్యానించారు. హసీనాను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ.. ఆమె చేతికి సంకెళ్లు వేసి మాత్రమే తీసుకురాగలం అని అన్నారు.