NTV Telugu Site icon

Mexico: ప్రధాని మోదీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలరు

Mexico

Mexico

PM Modi can bring peace between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ, పోప్ ప్రాన్సిస్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని లూయిస్ ఎబ్రార్డ్ యూఎన్ లో ప్రతిపాదించారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ శికరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన తర్వాత.. మెక్సికో విదేశాంగ మంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత ప్రధాని వ్యాఖ్యలను అమెరికా, కెనడా, ప్రాన్స్, యూకేతో పాటు వెస్ట్రన్ దేశాలు స్వాగతించాయి.

Read Also: National Herald Case: తెలంగాణకు తాకిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. టీకాంగ్‌ నేతలకు నోటీసులు..

అంతర్జాతీయ సమాజం శాంతిని సాధించేందుకు ప్రయత్నించాలని మెక్సికో కోరుకుంటోందని లూయిస్ ఎబ్రార్డ్ అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు, శాంతిని కాపాడేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యయోల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రతిపాదనను మీతో పంచుకుంటున్నానని భద్రతా మండలిలో లూయిస్ ఎబ్రార్డ్ తెలియజేశారు. చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను ఆయన కోరారు.

గురువారం జరిగిన యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, పుతిన్ తో అన్న మాటలను మరోసారి గుర్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. భారత్ కూడా ఆహార కొరత, ఎరువులు కొరతకు సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.