NTV Telugu Site icon

Bangladesh: ఉగ్రవాదులతో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..

Muhammad Yunus

Muhammad Yunus

Bangladesh: బంగ్లాదేశ్ క్రమక్రమంగా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని షేక్ హసీనా నిషేధించిన ‘‘జమాతే ఇస్లామీ’’ సంస్థకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ క్లీన్‌చిట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన హెఫాజత్-ఏ ఇస్లాం సంస్థ నాయకుడు మమునుల్ హక్, అతడి గ్రూపు సభ్యులతో కలిసి మహ్మద్ యూనస్ భేటీ కావడం వివాదాస్పదమైంది.

హెఫాజత్-ఏ ఇస్లాం ఉగ్రవాద కార్యకలాపాలకు పేరుగాంచింది. తరుచుగా భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభిస్తుంది. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుంది. శనివారం మహ్మద్ యూనస్, హెఫాజత్-ఏ ఇస్లాం నాయకులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సమావేశం భారత ఆందోళనకు కారణమైంది. షేక్ హసీనా హాయాంలో మమునుల్ హక్‌ హింసను ప్రేరేపించడంతో పాటు పలు ఆరోపణల కింద అరెస్ట్ చేశారు.

Read Also: Medak Temple: మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం

బంగ్లాదేశ్ రిజర్వేషన్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనలు మిన్నంటడంతో బంగ్లాదేశ్ ఆర్మీ అల్టిమేటంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఉన్నారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఉగ్రవాదులు, హింసాత్మక వ్యక్తులకు క్లీన్ చిట్ ఇస్తోంది. వరసగా వారితో భేటీలు నిర్వహిస్తోంది. ఇటీవల, తాత్కాలిక ప్రభుత్వం అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) చీఫ్ జషీముద్దీన్ రహ్మానీని విడుదల చేసింది. స్లీపర్ సెల్‌ల సాయంతో జిహాదీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తీవ్రవాద బృందం ప్రయత్నిస్తున్నందున ఇతడి విడుదల భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం.

బంగ్లాదేశ్ ప్రగతి శీల అంశాలను వ్యతిరేకిస్తున్న హెఫాజత్ ఏ ఇస్లాం, మత ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తోంది. 2010లో ఏర్పడిన ఈ సంస్థ ఇస్లామిక్ చట్టాలను సమర్థిస్తోంది. రాజ్యాంగ సూత్రాలను, లౌకికవాదాన్ని వ్యతిరేకిస్తోంది. గతంలో ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ పర్యటన సమయంలో మమునుల్ హక్ నిరసనలు చేపట్టింది.

Show comments