Site icon NTV Telugu

Pakistan: పాక్‌లో హిందువులపై ఆగని అఘాయిత్యాలు.. హిందూ బాలిక కిడ్నాప్, అత్యాచారం

Pakistan

Pakistan

Married Hindu girl abducted in Pakistan, raped: పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా హిందూ జనాభా అధికంగా ఉండే సింధ్ ప్రాంతంలోని థార్, ఉమర్‌కోట్, మీర్‌పుర్‌ఖాస్, ఘోట్కీ మరియు ఖైర్‌పూర్ ప్రాంతాలలో హిందూ యువతులు, బాలిక అపహరణ కొనసాగుతూనే ఉంది. హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎదిరిస్తే హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.

తాజాగా దక్షిణ సింధ్ ప్రావిన్సులో వివాహిత అయిన హిందూ బాలిక శాంతి జోగిని మతం మారాలని బెదిరించారు. అందుకు నిరాకరించడంతో అత్యాచారం చేశారు. మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సదరు బాలిక సోషల్ మీడియాలో చెబుతూ ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. ఉమర్ కోట్ జిల్లాలోని సమరో పట్టణంలో తనపై అత్యాచారం జరిగిందని, నిందితులపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని బాలిక తన బాధను వెల్లడించింది.

Read Also: Google Layoff: 8 నెలల గర్భిణి.. వారం రోజుల్లో మెటర్నిటీ లీవ్.. అంతలోనే ఉద్యోగం ఔట్..

ఆదివారం వరకు మీర్పూర్ ఖాస్ పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయలేదు. అమ్మాయి, ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేసినా ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్థానిక నాయకుడు చెప్పాడు. అప్పటికే వివాహం అయిన బాలికను ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, అతని సహచరులు కిడ్నాప్ చేశారని.. తనను బెదిరించి ఇస్లాంలోకి మారాలని చెప్పారని.. అందుకు తాను నిరాకరించడంతో మూడు రోజుల పాటు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఆరోపించింది.

గతేడాది జూన్ నెలలో తనను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని, బలవంతంగా ముస్లిం వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారని, హిందూ యువతి కరీనా కుమారి కోర్టులో వెల్లడించింది. గతేడాది ముగ్గురు హిందూ బాలికలు సత్రన్ ఓడ్, కవితా భీల్, అనితా భీల్ లను కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చారు. ఎనిమిది రోజుల తర్వాత ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహం చేశారు. మార్చి 21న సుక్కూర్ ప్రాంతంలో పూజాకుమారి అనే యువతిని దారుణంగా కాల్చి చంపారు. బాలికలు, యువతులే కాదు పెళ్లిలు అయిన మహిళలను కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మారుస్తున్నారు. గోరీ కోహ్లీ అనే నలుగురు పిల్లల తల్లిని సింధ్ లోని ఖిప్రో నుంచి కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి, మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.

Exit mobile version