అమెరికాలోని ఫ్లోరిడాలో విచిత్రం చోటుచేసుకుంది. ఫోర్ట్ లౌడెర్‌డేల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కొంటెపనికి పాల్పడ్డాడు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించడాన్ని చూసి విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. దానిని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. అందుకు ఆడమ్ జేన్ నిరాకరించారు.
Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
విమాన సిబ్బంది ఎంత చెప్పినా ఆడమ్ జేన్ మాట వినలేదు. దీంతో సదరు ప్రయాణికుడిని విమాన సిబ్బంది విమానం నుంచి దించేశారు. మాస్కు నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ఆడమ్ జేన్ మాట్లాడుతూ.. విమానంలో తినేటప్పుడు, తాగేటప్పుడు కూడా మాస్కు ధరించాలని చెబుతున్నారని, అందుకు నిరసనగానే తాను ఈ పని చేసినట్టు వివరించాడు. గతంలో కూడా తాను ఇలాగే ప్రయాణించానని, అప్పట్లో విమాన సిబ్బంది తనను అడ్డుకోలేదని గుర్తు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.