Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేసినందుకు ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో స్టేట్ మినిష్టర్ ఉన్న షమ్నాజ్ సలీమ్, ప్రెసిడెంట్ కార్యాలయంలో మంత్రిగా పనిచేస్తున్న ఆమె మాజీ భర్త ఆడమ్ రమీజ్ మరియు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ఆరోపణల్ని వారు నిరాకరించారు. చేతబడికి చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
షమ్నాజ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేశారు. వీరి ముగ్గురిని ఏడు రోజుల రిమాండ్‌కి తరలించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆమెను బుధవారం సస్పెండ్ చేశారు. రమీజ్‌ని గురువారం సస్పెండ్ చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు మంత్రులు కూడా మాల్దీవుల రాజధాని మాలే నగర మేయర్‌గా ముయిజ్జూ పనిచేసే సమయంలో అతని సహచరులుగా ఉన్నారు. కౌన్సిల్ సభ్యులుగా ముయిజ్జూతో కలిసి పనిచేశారు.
గతేడాది నవంబర్ నెలలో ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షమ్నాజ్‌ని అధ్యక్షుడి అధికారిక నివాసమైన ములియాగేలో స్టేట్ మినిష్టర్‌గా నియమించి, ఆ తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. మాలే సిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న సమయంలో రమీజ్, ముయిజ్జూకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, దీనిపై అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.