శ్రీలంక అధ్యక్ష బరిలోకి మహీందా రాజపక్సా కుటుంబం నుంచి వారసుడు బరిలోకి వచ్చాడు. సెప్టెంబర్ 21న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కుమారుడు నమల్ రాజపక్సా పోటీ చేయబోతున్నట్లు కుటుంబం ప్రకటించింది. ఎస్‌ఎల్‌పీపీ పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్సా (38) పేరును ప్రతిపాదించారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర కరియవసామ్ వెల్లడించారు.
నమల్ రాజపక్సా ఎంట్రీతో అధ్యక్ష ఎన్నికల పోరు నలుగురి మధ్య జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సజిత ప్రేమదాస, జీవీపీ నాయకుడు అరుణ కుమార దిశనాయకే బరిలో నిలిచారు. తాజాగా నమల్ బరిలోకి వచ్చాడు. ఇదిలా ఉంటే 2022 జులైలో రాజపక్సాకు చెందిన కుటుంబమే.. విక్రమసింఘేకు అధికారం దక్కేలా సహకరించింది. ఆయన గొటబాయ నుంచి అధికారం స్వీకరించారు. 2022 ఏప్రిల్‌లో శ్రీలంక ప్రభుత్వం అప్పులు చెల్లించలేక చేతులు ఎత్తేసింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా చోటు చేసుకొన్న ఆందోళనలు, అధ్యక్ష భవనం ఆక్రమణతో గొటబాయ పదవిని వదులుకొన్నారు. దీంతో విక్రమసింఘే అధికారం చేపట్టారు. తాజాగా ఎస్‌ఎల్‌పీపీకి చెందిన దాదాపు 100 మంది ఎంపీలు రాజపక్సాకు మద్దతుగా నిలిచారు. దీంతో నమల్ పేరు తెరపైకి వచ్చింది.
నమల్ బ్యాగ్రౌండ్ ఇదే..
నమల్ 2010 నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 2020 పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ కోట అయిన హంబన్‌తోట జిల్లాలో డీప్ సౌత్ నుంచి భారీ మెజార్టీతో నమల్ గెలుపొందారు. నమల్ ఇంగ్లండ్, శ్రీలంకలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆసక్తిగల క్రీడాకారుడు కూడా. శ్రీలంక జాతీయ రగ్బీ జట్టు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. లిమిని వీరసింహను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నమల్‌కు కనీసం 40 ఏళ్లు నిండకముందే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని అతని స్నేహితుల్లో చాలా మందికి తెలుసు. కానీ పరిస్థితులను బట్టి 38 ఏళ్లలోనే అధ్యక్ష బరిలోకి రావాల్సి వచ్చింది.