UK Elections: బ్రిటన్‌లో జూలై 4న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో లేబర్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పెద్దలు ఓడిపోయారు. నివేదికల ప్రకారం, కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు, బ్రిటీష్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కూడా సౌత్ వెస్ట్ నార్ఫోక్ స్థానం నుంచి ఈ ఎన్నికలలో ఓడిపోయారు. లేబర్ పార్టీకి చెందిన టెర్రీ జెరెమీ చేతిలో 630 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
యూకే ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టామర్‌కు అభినందనలు తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. అయితే రిషి సునాక్ తన స్థానం నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు లేబర్ పార్టీ అఖండ మెజారిటీ సాధించిందని అధికారిక ఫలితాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం 7 గంటల వరకు 650 స్థానాలకు గానూ లేబర్ పార్టీ 410 స్థానాల్లో విజయం సాధించింది.
14 ఏళ్ల తర్వాత కన్జర్వేటివ్ ప్రభుత్వం ఓటమి
బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ప్రధాన మంత్రి సునాక్ 23,059 ఓట్ల తేడాతో ఉత్తర ఇంగ్లండ్‌లోని రిచ్‌మండ్, నార్తల్లెర్టన్ స్థానాలను మళ్లీ గెలుచుకున్నారు. అయితే దేశంలో 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. రిషి సునాక్ మాట్లాడుతూ, ‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. లేబర్ పార్టీ విజయానికి లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టామర్‌కు అభినందనలు తెలిపారు. ఆ సమయంలో సునాక్‌తో పాటు అతని భార్య అక్షతా మూర్తి కూడా ఉన్నారు.
నన్ను క్షమించండి: సునాక్
దేశంలో అధికారం శాంతియుతంగా, సద్భావనతో చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు , స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్‌లోని తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ అన్నారు. క్షమించండి.. ఓటమికి తాను బాధ్యత వహిస్తానని రిషి సునాక్ పేర్కొన్నారు.
కీర్ స్టామర్ కృతజ్ఞతలు
లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టామర్ లండన్‌లోని హోల్‌బోర్న్, సెయింట్ పాన్‌క్రాస్ స్థానాలను గెలిచారు. ఆయన యూకే నూతన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను గొంతుగా ఉంటానని.. ప్రతిరోజు మీ కోసం పోరాడతానని కీర్ స్టామర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది మీ ప్రజాస్వామ్యం, మీ సంఘం, మీ భవిష్యత్తు కాబట్టి మార్పు ఇక్కడే మొదలవుతుందన్నారు. మీరు ఓటు వేశారు కాబట్టి.. ఇప్పుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందని స్టామర్ తన పార్టీ విజయం తర్వాత ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.