North Korea vs South Korea: ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్ రంగంలోకి దిగింది.. అంతే కాదు.. దక్షిణ కొరియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో.. కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. సరిహద్దును పటిష్టం చేసే పనులను అడ్డుకునే ప్రయత్నం చేసినా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా సైనికులపై కాల్పులు జరిపినా తక్షణమే తీవ్ర ప్రతీకారం ఉంటుందని స్పష్టం చేసింది..
ఇటీవల సరిహద్దు సమీపంలో జరిగిన పేలుళ్లకు ఉత్తర కొరియా అమర్చిన మందుపాతరలే కారణమని దక్షిణ కొరియా ఆరోపించింది. అయితే, ఈ వాదనను కిమ్ యో జోంగ్ పూర్తిగా తోసిపుచ్చారు. దక్షిణ కొరియా ఆరోపణలను కుట్రగా అభివర్ణించిన ఆమె.. ఉత్తర కొరియా సైనికులు తమ భూభాగంలోనే సరిహద్దు రక్షణ చర్యలు చేపడుతున్నారని.. వారి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే, అమెరికా నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి కమాండ్‌తో కలిసి నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో సరిహద్దులో జరిగిన పేలుళ్లకు ఉత్తర కొరియా అమర్చిన మందుపాతరలే కారణమని తేలిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు.. ఈ ఘటనలో ఉత్తర కొరియా ప్రమేయం నిర్ధారణ అయితే ప్రతీకార చర్యలను పరిశీలిస్తామని దక్షిణ కొరియా రక్షణ మంత్రి కాంగ్ షిన్-చుల్ ప్రకటించారు..
పేలుళ్లలో ముగ్గురు అధికారులు గాయాలు
సెప్టెంబర్ 21న సైనిక రహిత ప్రాంతం (DMZ)లోని సైనిక సరిహద్దు సమీపంలో వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. పశ్చిమ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సైనికులు గస్తీ మార్గాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో సరిహద్దుకు సుమారు 10 మీటర్ల దక్షిణాన ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దక్షిణ కొరియా సైనిక అధికారులు గాయపడ్డారు. గత ఏడాది నుంచే ఆ ప్రాంతంలో భూగర్భ పరిస్థితుల్లో మార్పులను గమనించినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. దీంతో అక్కడ ఉత్తర కొరియా మందుపాతరలు అమర్చినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయని, దర్యాప్తు కోసం మార్గాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని, పేలుడు పదార్థాలను పరిశీలించిన దక్షిణ కొరియా అధికారులు.. అక్కడ ఉత్తర కొరియాకు చెందినదిగా భావిస్తున్న మరో మందుపాతరను కూడా గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో దక్షిణ కొరియా లేదా దాని మిత్రదేశాలు ఆ ప్రాంతంలో మందుపాతరలు అమర్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నారు.
కాల్పులు జరిగితే తీవ్ర ప్రతిస్పందన
ఉత్తర కొరియా చేపడుతున్న సరిహద్దు పటిష్టీకరణ పనులు తమ సార్వభౌమాధికార పరిధిలోనే ఉన్నాయని కిమ్ యో జోంగ్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా సైనికులు సరిహద్దు దాటలేదని స్పష్టం చేశారు. అయితే దక్షిణ కొరియా హెచ్చరికలు జారీ చేయడం, ఉత్తర కొరియా సైనికులపై హెచ్చరిక కాల్పులు జరపడం ద్వారా ఉద్రిక్తతలను పెంచుతోందని ఆమె ఆరోపించారు. సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా సైనికులపై దక్షిణ కొరియా దళాలు కాల్పులు జరిపితే, సరిహద్దులో మోహరించిన ఉత్తర కొరియా యూనిట్లు వేగంగా, నిర్దాక్షిణ్యంగా ప్రతిస్పందిస్తాయని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. అయితే, ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న DMZ సుమారు 248 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ ప్రాంతంలో దాదాపు 20 లక్షల మందుపాతరలు పాతిపెట్టి ఉన్నట్లు అంచనా. ఇరువైపులా ముళ్లకంచెలు, ట్యాంక్ విధ్వంసక అవరోధాలు, భారీగా సైనిక బలగాలను మోహరించారు. దీంతో చిన్నపాటి ఘటన కూడా పెద్ద సరిహద్దు ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది.

