Kim Jong Un in Coma: ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) జరగడంతో కిమ్.. కోమాలోకి వెళ్లినట్లు బ్రిటన్‌కు చెందిన ది సన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అత్యవసర వైద్యం కోసం ఆయనను చైనాలోని బీజింగ్‌కు తరలించినట్లు కూడా పేర్కొంది. అయితే, ఈ వార్తలను ఉత్తర కొరియా ప్రభుత్వం గానీ.. అధికారిక వర్గాలు ఇప్పటి వరకు ధృవీకరించలేదు..
బీజింగ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స?
ది సన్ కథనం ప్రకారం, ప్యోంగ్యాంగ్లో వైద్య పరికరాల పరిస్థితి సరిగా లేకపోవడంతో కిమ్‌ను దేశం దాటి చైనాకు తరలించినట్లు సమాచారం. బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర వైద్య సహాయం అందించినట్లు ఆ పత్రిక పేర్కొంది.. ఇక, ఆ కథనం ప్రకారం, అక్టోబర్ 11న ప్యోంగ్యాంగ్లోని ఓ రహస్య ప్రాంతంలో నిర్వహించిన రక్షణ మ్యూజియం సందర్శన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వెలువడినట్లు పేర్కొంది.
కిమ్ ఆరోగ్యంపై గతంలోనూ ఊహాగానాలు
అయితే, కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై గతంలోనూ పలు సందర్భాల్లో వార్తలు, ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయన అధిక బరువుతో ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ అంచనా వేసినట్లు కథనంలో పేర్కొన్నారు. ఆయన బరువు 140 కిలోలకు పైగా, ఎత్తు సుమారు 170 సెంటీమీటర్లు ఉంటుందని నివేదిక తెలిపింది. ఇక, కిమ్ కుటుంబంలోనూ ఊబకాయం, ధూమపానం వంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్లు కథనం ప్రస్తావించింది. ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సంగ్ కూడా అధిక బరువు కలిగి ఉండేవారని, అధికంగా ధూమపానం చేసేవారని పేర్కొంది.
మరణ వార్తలపై గతంలోనూ ప్రచారం
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపైనే కాదు.. ఆయన ఏకంగా మరణించారంటూ గతంలోనూ పుకార్లు వ్యాపించాయని ఉత్తర కొరియా వ్యవహారాల విశ్లేషకుడు బెనెడిక్ట్ రోజర్స్ ది సన్తో పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది. ఉత్తర కొరియా నాయకుడు మరణించిన సందర్భంలో గతంలో ప్రజలు పెద్దఎత్తున బహిరంగంగా దుఃఖం వ్యక్తం చేశారని, వార్తా ప్రసారాల్లోనూ భావోద్వేగాలు కనిపించాయని ఆయన వివరించినట్లు పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి అలాంటి పరిణామాలు కనిపించలేదని రోజర్స్ వ్యాఖ్యానించినట్లు నివేదిక వెల్లడించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారీ ఆదాయం?
ఇదిలా ఉండగా 2022 నుంచి 2025 మధ్య కాలంలో కిమ్ జోంగ్ ఉన్ పాలనకు విదేశాల నుంచి సుమారు 22 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం సమకూరినట్లు అంచనాలు ఉన్నాయి.. గత కాలంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రష్యాకు ఆయుధాలు, సైనికులను అందించడం ద్వారా ఉత్తర కొరియాకు ఆదాయం పెరిగినట్లు ఆ కథనం తెలిపింది. మొత్తంగా, కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారంటూ వెలువడిన వార్తలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే, ఆయనకు బ్రెయిన్ హెమరేజ్ జరిగిందా, బీజింగ్‌కు తరలించారా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..

