Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా

Kim Jong Un

Kim Jong Un

Kim Jong Un Death Rumors: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు సంబంధించిన కొత్త ఫొటోలను ఉత్తర కొరియా విడుదల చేసింది. చిన్నారుల షూస్, మహిళల దుస్తులను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల ఆయనకు తీవ్ర వైద్య సమస్య తలెత్తిందని, చికిత్స పొందుతూ మరణించారని కొన్ని ఆన్‌లైన్ పోస్టుల్లో ప్రచారం జరిగింది. అయితే, ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ సోమవారం ఓ దుస్తులు, పాదరక్షల ప్రదర్శనను సందర్శించారు. అక్కడ వివిధ ఉత్పత్తులను పరిశీలిస్తూ, అధికారులతో మాట్లాడుతున్నట్లుగా ఫొటోలు విడుదలయ్యాయి. అయితే ఈ చిత్రాల ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించలేదు. అలాగే అవి ఖచ్చితంగా ఏ తేదీన తీసినవో స్పష్టత లేదు.

చైనా అసమ్మతివాది పోస్టులతో కిమ్ మరణంపై పుకార్లు

అమెరికాలో నివసిస్తున్న చైనా అసమ్మతివాది, చైనా డెమోక్రసీ పార్టీతో సంబంధాలున్న వాంజున్ జీ (Wanjun Xie) ఆదివారం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులతో ఈ ప్రచారం మొదలైంది. కిమ్ జోంగ్ ఉన్ మరణించారని, వారసత్వ మార్పు సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనతో చైనా 9,000 మంది సైనికులను ప్యాంగ్యాంగ్‌కు పంపిందని ఆయన తొలుత పేర్కొన్నారు. ఆ తర్వాత కిమ్‌కు తీవ్ర స్థాయిలో మెదడులో రక్తస్రావం జరిగిందని, ఆయనకు చికిత్స అందించేందుకు బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి నిపుణులు శనివారం ఉత్తర కొరియాకు వెళ్లారని జీ ఆరోపించారు. కిమ్ కోమాలోకి వెళ్లడంతో అత్యవసర చికిత్స కోసం బీజింగ్‌కు తరలించారని, అక్కడ చికిత్స పొందినప్పటికీ మరణించారని, అనంతరం ఆయన మృతదేహాన్ని రహస్యంగా ఉత్తర కొరియాకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలకు మద్దతుగా జీ ఎలాంటి వైద్య రికార్డులు, గుర్తించగలిగే సాక్షులు లేదా స్వతంత్రంగా నిర్ధారించగల ఆధారాలను వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. అంతర్జాతీయ మీడియా సంస్థల్లోనూ దీనిపై కథనాలు వెలువడ్డాయి.

కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ బాధ్యతలు చేపట్టారా?

కిమ్ జోంగ్ ఉన్ మరణించారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ దేశ పాలనా బాధ్యతలను చేపట్టారా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే కిమ్ మరణించారన్న వార్తలపై ఉత్తర కొరియా అధికారులు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. విడుదలైన తాజా ఫొటోలు ఆయన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ, వాటి తేదీ, ప్రామాణికతపై స్పష్టత లేకపోవడంతో వాటిని మాత్రమే ఆధారంగా చేసుకుని పుకార్లకు ముగింపు పలకలేం.

ఊబకాయంతో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఉందన్న దక్షిణ కొరియా

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై అంతర్జాతీయంగా చాలాకాలంగా ఆసక్తి నెలకొంది. ఉత్తర కొరియా నాయకత్వానికి సంబంధించిన సమాచారం అత్యంత రహస్యంగా ఉండటం, నాయకత్వంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంటే ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం పడే అవకాశం ఉండటమే ఇందుకు కారణాలు. దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ సెప్టెంబర్ చివర్లో చట్టసభ సభ్యులకు తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్ బరువు సుమారు 140 కిలోలు (309 పౌండ్లు) ఉండవచ్చని అంచనా వేసింది. దీంతో ఆయనకు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. అయితే, ఆయనకు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు లేవని కూడా ఆ సంస్థ తెలిపింది. నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్‌ను పరిశీలించే సమయంలో కిమ్ మెట్లు వేగంగా ఎక్కగలిగారని ప్రస్తావించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు భావిస్తున్నామని వెల్లడించింది.

2011 నుంచి ఉత్తర కొరియా పగ్గాలు కిమ్ చేతుల్లోనే..

కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణం తర్వాత 2011 డిసెంబర్‌లో ఉత్తర కొరియా అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ ప్రారంభించిన కుటుంబ పాలనను కొనసాగిస్తున్నారు. కిమ్ పాలనలో ఉత్తర కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోంది. దీంతో అమెరికా, దక్షిణ కొరియాతో ఆ దేశ సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి.