ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అంత్యక్రియలకు లక్షలాది మంది తరలివచ్చారు. ఈ ఉదయమే అంత్యక్రియలు పూర్తి కావాల్సి ఉండగా సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఖమేనీ పార్థివదేహం ఖమేనీ స్వస్థలమైన ఈశాన్య ఇరాన్‌లోని మష్హద్ నగరానికి చేరుకుంది. అయితే ఇరాక్‌లోని పవిత్ర నగరాలు నజఫ్, కర్బలా దగ్గర నిర్వహించిన అంతిమయాత్రల్లో లక్షలాది మంది పాల్గొనడంతో అంత్యక్రియల కార్యక్రమం ఆలస్యమైంది. తొలుత గురువారం ఉదయమే అంత్యక్రియలు పూర్తి కావాల్సి ఉండగా.. భారీ జనసందోహం కారణంగా అంత్యక్రియలను వాయిదా వేశారు.
ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ విడుదల చేసిన దృశ్యాల్లో మహాన్ ఎయిర్ విమానం ద్వారా ఖమేనీ భౌతికకాయం మష్హద్ విమానాశ్రయానికి చేరుకున్నట్లు కనిపించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు (అనగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల లోపు అంత్యక్రియలు పూర్తి కావొచ్చని తెలుస్తోంది.
అంతిమయాత్ర
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న ఖమేనీ మరణించారు. మూడు నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. భీకరమైన యుద్ధం కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అంత్యక్రియల్లో భాగంగా ముందుగా ఇరాక్‌లోని నజఫ్, కర్బలా నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని విమానంలో మష్హద్‌కు తరలించారు. ఈ సాయంత్రంతో అన్ని కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. టెహ్రాన్‌తో పాటు పలు నగరాల్లో జరిగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఖమేనీకి నివాళులర్పించారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కాపాడిన నాయకుడిగా.. అమెరికా-ఇజ్రాయెల్ విధానాలకు వ్యతిరేకంగా నిలిచిన నేతగా ఆయనను కొనియాడారు.
భిన్నాభిప్రాయాలు
ఒకవైపు వేలాది మంది మద్దతుదారులు ఖమేనీకి ఘనంగా నివాళులర్పిస్తుండగా.. మరోవైపు ఆయన మూడు దశాబ్దాల పాలనపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఇరాన్ సమాజంలో ఉన్న రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టెహ్రాన్‌కు చెందిన 60 ఏళ్ల హుస్సేన్ అక్బరీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచానికి మేము అణచివేతకు తలవంచబోమని, మా నాయకుడి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని నిరూపించడమే మా లక్ష్యం.’’ అని అన్నారు. 1989లో అయతల్లా రుహొల్లా ఖమేనీ మరణం అనంతరం అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని విస్తరించడంతో పాటు అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అలాగే ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు మద్దతు పెంచుతూ, పాశ్చాత్య దేశాలపై కఠిన వైఖరిని కొనసాగించింది.
రాజకీయ విభజన
అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన పలువురు ఇరానీయులు దేశం ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్‌కు మద్దతు ఇచ్చేవారు, రాజకీయ మార్పు కోరుకునేవారిగా తీవ్రంగా విభజించబడిందని తెలిపారు. టెహ్రాన్‌కు చెందిన ఓ టెక్నాలజీ ఉద్యోగి మాట్లాడుతూ… ‘‘దేశవ్యాప్తంగా కుటుంబాల మధ్యే తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.’’ అని అన్నారు. ఇటీవల అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌కు సన్నిహితుడైన ఓ సీనియర్ అధికారి కూడా ఇరాన్ తీవ్ర రాజకీయ ధ్రువీకరణను ఎదుర్కొంటోందని అంగీకరించారు. అయితే ప్రస్తుత వ్యవస్థలోనే సంస్కరణలు కోరుకునే పెద్ద వర్గం కూడా ఉందని పేర్కొన్నారు. ఖమేనీ పాలనలో ప్రభుత్వం వ్యతిరేక నిరసనలపై పలు మార్లు కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా జనవరిలో జరిగిన దేశవ్యాప్త నిరసనల్లో వేలాది మంది మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక నిరసనకారుడి సోదరి మాట్లాడుతూ.. ‘‘కూలీలు కనీసం రొట్టె కూడా కొనలేని పరిస్థితి. నా సోదరి మరణించిన తర్వాత మా జీవితం పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ఆమె ఫొటోలు, వీడియోలు చూసుకుంటూ ఏడవడం తప్ప మాకు ఏమీ మిగలలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల పెరుగుదల ఖమేనీ పాలన చివరి సంవత్సరాల ప్రధాన లక్షణాలుగా పేర్కొన్నారు. 33 ఏళ్ల టెహ్రాన్ నివాసి మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు మా పోరాటం అద్దె, ఆహారం వంటి కనీస అవసరాలు తీర్చుకోవడానికే పరిమితమైంది.’’ అని అన్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు అమెరికా దాడులు చేస్తోంది. రెండు రోజుల క్రితం హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో మళ్లీ దాడులు మొదటికొచ్చాయి. నిన్నటి నుంచి తిరిగి దాడులు మొదలయ్యాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

