Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్‌మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?

  • FBI డైరెక్టర్ కాష్ పటేల్ పెళ్లికి రెడీ
  • కాబోయే భార్య అలెక్సిస్ విల్కిన్స్ ఎవరో తెలుసా?
Kash Patel Engaged

Kash Patel Engaged

Kash Patel Engaged: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ తన చిరకాల ప్రియురాలు, కంట్రీ సింగర్‌, రాజకీయ వ్యాఖ్యాత అలెక్సిస్ విల్కిన్స్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న వీరి సంబంధాన్ని తాజాగా ఇద్దరూ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ హై-ప్రొఫైల్ జంటపై మరోసారి చర్చ మొదలైంది. అలెక్సిస్ విల్కిన్స్ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కాష్ పటేల్‌తో కలిసి ఉన్న నలుపు-తెలుపు ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ప్రదర్శించారు. దీనికి ఆమె “Went and got the law involved” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. అనంతరం కాష్ పటేల్ కూడా ఆమె పోస్టును రీపోస్ట్ చేశారు.

2022లో తొలిసారి పరిచయం.. 2023 నుంచి డేటింగ్

కాష్ పటేల్, అలెక్సిస్ విల్కిన్స్‌ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పటేల్ FBI డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందే వీరి సంబంధం ప్రారంభమైంది. తాజా నివేదికల ప్రకారం, వీరిద్దరూ 2022లో నాష్‌విల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అనంతరం 2023లో డేటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. 2025లో కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా విల్కిన్స్ హాజరయ్యారు. అప్పటి నుంచి ఈ జంటకు సంబంధించిన ఫొటోలు, పబ్లిక్ ఈవెంట్లలో వీరి హాజరు తరచుగా వార్తల్లో నిలిచాయి.

అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?

అలెక్సిస్ విల్కిన్స్ అమెరికన్ కంట్రీ మ్యూజిక్ సింగర్‌తో పాటు రాజకీయ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. ఆమె తన తొలి మ్యూజిక్ ప్రాజెక్ట్‌ను 2023లో విడుదల చేశారు. కంట్రీ మ్యూజిక్‌తో పాటు సంప్రదాయవాద భావజాలానికి సంబంధించిన సంస్థలు, రాజకీయ కార్యక్రమాలతో కూడా విల్కిన్స్‌కు అనుబంధం ఉంది. తన వెబ్‌సైట్‌లో ఆమె తన సంగీత శైలిని కంట్రీ మ్యూజిక్ సంప్రదాయాలను గౌరవిస్తూ, సమకాలీన అంశాలు, ప్రస్తుత వ్యాఖ్యానాలను జోడించే విధంగా ఉంటుందని వివరించారు. అమెరికా రాజకీయాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు.

ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌తో మరోసారి వార్తల్లోకి

కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా అత్యంత కీలకమైన ప్రభుత్వ బాధ్యతల్లో ఉండగా, అలెక్సిస్ విల్కిన్స్ కంట్రీ మ్యూజిక్‌తో పాటు రాజకీయ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో పబ్లిక్ ఫిగర్లుగా ఉండటంతో వీరి వ్యక్తిగత జీవితం కూడా తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఎంగేజ్‌మెంట్ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఈ హై-ప్రొఫైల్ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.