Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!

  • మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య
  • ఐరిష్-ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త కామెరాన్‌తో పెళ్లి
  • ఏడాది కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం
Imarnkhan2

Imarnkhan2

పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమిమా గోల్డ్‌స్మిత్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న 22 ఏళ్ల తర్వాత ఐరిష్-ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త, ఫైనాన్షియర్ కామెరాన్‌ను అధికారికంగా వివాహం చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను జెమిమా గోల్డ్‌స్మిత్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సోదరుడు బెన్ గోల్డ్‌స్మిత్ భార్య జెమిమా జోన్స్ వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. జెమిమా, కామెరాన్ వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. జెమిమా గోల్డ్‌స్మిత్-కామెరాన్‌ వృత్తిపరమైన పరిచయం ద్వారా కలుసుకున్నట్లు సమాచారం. ఏడాదికి పైగా డేటింగ్ చేసిన అనంతరం వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మే నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటికి సుమారు ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వివాహానికి ముందు జెమిమా, కామెరాన్ స్విట్జర్లాండ్‌లోని ఆయన ఇంటితో పాటు వెస్ట్ లండన్‌లోని జెమిమా నివాసంలో సమయాన్ని గడిపినట్లు తెలుస్తోంది.

ఎవరీ కామెరాన్

62 ఏళ్ల కామెరాన్ ఓ‘రైల్లీ అసలు పేరు ఆంథోనీ కామెరాన్ ఓ‘రైల్లీ. ఆయన ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జన్మించారు. ఐరిష్‌, ఆస్ట్రేలియన్ పౌరసత్వాలు కలిగి ఉన్నారు. తండ్రి దివంగత సర్ ఆంథోనీ ఓ‘రైల్లీ ప్రముఖ ఐరిష్ మీడియా వ్యాపారవేత్తతో పాటు అంతర్జాతీయ రగ్బీ క్రీడాకారుడిగా కూడా పేరొందారు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న కామెరాన్ ఓ‘రైల్లీ తన కెరీర్‌ను ఫైనాన్స్ రంగంలో ప్రారంభించారు. కొంతకాలం గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేశారు. ఆ తర్వాత తన తండ్రికి చెందిన ఇండిపెండెంట్ న్యూస్ అండ్ మీడియా సంస్థలో పనిచేశారు.

జెమిమా గోల్డ్‌స్మిత్ ఎవరు?

52 ఏళ్ల జెమిమా గోల్డ్‌స్మిత్ 1974లో లండన్‌లోని చెల్సియాలో జన్మించారు. ఆమె తండ్రి దివంగత బ్రిటిష్ ఫైనాన్షియర్ సర్ జేమ్స్ గోల్డ్‌స్మిత్ కాగా.. తల్లి లేడీ అన్నాబెల్ గోల్డ్‌స్మిత్ 2025 అక్టోబర్‌లో మరణించారు. జెమిమా గోల్డ్‌స్మిత్ ఇన్‌స్టింక్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. స్క్రీన్‌రైటర్‌, టెలివిజన్‌, సినిమా నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది. డాక్యుమెంటరీలు, స్క్రిప్టెడ్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆమె పనిచేశారు. బ్రిటన్‌లోని ప్రముఖ సామాజిక వర్గాలతో ఆమెకు సుదీర్ఘ అనుబంధం ఉంది. దివంగత ప్రిన్సెస్ డయానాకు కూడా జెమిమా సన్నిహిత స్నేహితురాలిగా ఉండేవారు.

ఇమ్రాన్ ఖాన్‌తో వివాహం.. తొమ్మిదేళ్లకే విడాకులు

జెమిమా గోల్డ్‌స్మిత్ తొలి వివాహం పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌తో జరిగింది. 1995లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న అనంతరం 2004లో విడాకులు తీసుకున్నారు. వీరికి సులేమాన్‌, ఖాసిమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జెమిమా-ఇమ్రాన్ ఖాన్ వివాహం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ప్రముఖ బ్రిటిష్ కుటుంబానికి చెందిన జెమిమా.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాకిస్థాన్ క్రికెటర్‌, ఆ తర్వాత రాజకీయ నాయకుడైన ఇమ్రాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. వివాహ సమయంలో జెమిమా కొంతకాలం పాకిస్థాన్‌లో కూడా నివసించారు. విడాకుల తర్వాత కూడా ఇద్దరూ తమ పిల్లల కారణంగా సంబంధాన్ని కొనసాగించారు.

జైల్లోనే ఇమ్రాన్ ఖాన్..  

జెమిమా రెండో వివాహం చేసుకున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ మాత్రం పాకిస్థాన్‌లో జైలు జీవితం గడుపుతున్నారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్నారు. ప్రభుత్వ బహుమతుల విక్రయానికి సంబంధించిన కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనను జైలులో ఉంచారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, వైద్య చికిత్సపై ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో తనను కలవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన కుమారులు బహిరంగంగా చెప్పారు. కుడి కంటిలో చూపు గణనీయంగా తగ్గిందని ఇమ్రాన్ కుటుంబం తెలిపింది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు గతంలో ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయన వ్యక్తిగత వైద్యులు, సోదరి కూడా ఉండేలా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించింది. 2026 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్‌ను కొద్దికాలం ఆసుపత్రికి తరలించారు. కంటి వైద్య నిపుణుడు, కార్డియాలజిస్ట్‌, ఫిజీషియన్ సహా వైద్యులు ఆయనను పరీక్షించి వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నట్లు పాకిస్థాన్ సమాచార మంత్రి తెలిపారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు.