ఇరాన్‌తో శాంతి చర్చల కోసం జేడీ వాన్స్ బృందం కొద్దిసేపటి క్రితమే ఇస్లామాబాద్ చేరుకుంది. గత అర్ధరాత్రే ఇరాన్ బృందం నూర్‌ఖాన్ ఎయిర్‌పోర్టులో దిగింది. ఆసిమ్ మునీర్ ఘనంగా స్వాగతం పలికాడు. వాస్తవంగా రెండు దేశాల మధ్య చర్చలు శనివారం ఉదయం 10:30 గంటలకు జరగాల్సి ఉండగా.. అమెరికా బృందం ఇప్పుడే రావడంతో చర్చలు ఆలసమయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే తొలుత రెండు దేశాల బృందాల మధ్య పరోక్ష చర్చలు జరగనున్నాయి. అనంతరం రాత్రికి ప్రత్యక్ష చర్చలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు పక్షాలకు మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. అయితే ఈ చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా అంతర్జాతీయ మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తోంది.
2 దేశాల డిమాండ్లు ఇవే..
రెండు దేశాల మధ్య కీలక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. లెబనాన్‌పై దాడులు ఆపేయాలని.. అలాగే అమెరికా స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ నగదును తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుండగా.. యురేనీయం శుద్ధిని ఆపేయాలని.. అలాగే హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. హార్ముజ్‌ను అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాల నుంచి డబ్బు వసూలు చేయడాన్ని అమెరికా తప్పుపడుతోంది.
ఇరాన్ నుంచి..
ఇరాన్‌కు చెందిన ఆరుగురు ప్రముఖులు చర్చల్లో పాల్గొననున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ చర్చలకు నేతృత్వం వహించనున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యదర్శి అలీ అక్బర్ అహ్మదీన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్నాసర్ హెమ్మతి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సీనియర్ దౌత్యవేత్త మజీద్ తఖ్త్ రవాంచి , భద్రతా నిపుణుడు మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ కూడా ఈ చర్చల్లో భాగమవుతారని ఇరాన్ పేర్కొంది.
ఇక ఇరాన్ ప్రతినిధి బృందానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. ఇటీవల అమెరికా దాడుల్లో 168 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారు. దీంతో ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ పాకిస్థాన్‌కు చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫొటోను పంచుకున్నారు. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది చిన్నారులు మరణించిన ఘటనకు గుర్తుగా విమానంలోని ఫొటోను పంచుకున్నారు. పిల్లలకు నివాళులర్పిస్తూ… అంతర్జాతీయ వేదికపై ఆ ఘటనను గుర్తుచేసుకుంది.
అమెరికా నుంచి..
ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు నలుగురు ప్రముఖ అమెరికా వ్యక్తులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్, మధ్యప్రాచ్య ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కూడా ఈ శాంతి చర్చలకు హాజరవుతున్నారు.
పాకిస్థాన్ నుంచి…
శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున పలువురు కీలక అధికారులు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ భద్రతా సలహాదారు మహమ్మద్ అసిమ్ మాలిక్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
ట్రంప్ వార్నింగ్..
ఇదిలా ఉంటే చర్చలకు ముందు ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని.. ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా? దాడులా? అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.
