NTV Telugu Site icon

Japan: జపాన్‌ అంతరిక్ష ప్రయోగం విఫలం.. రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల్లోనే పేలిపోయింది

Japan

Japan

Japan: ఈ మధ్య కాలంలో అంతరిక్షంలోకి రాకెట్లను పంపించడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఇండియా శ్రీహరి కోట నుంచి చంద్రయాన్‌-3 ప్రయోగం జరుగుతోంది. ఇలాంటి ప్రయోగాలను చేయాలని ఇతర దేశాలు కూడా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అలాగే జపాన్‌ దేశం జరపతలపెట్టిన అంతరిక్ష కార్యక్రమానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న ఘన ఇంధన రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల సమయంలోనే పేలిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకొన్నట్టు ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసి ది ఎప్సిలాన్‌-ఎస్‌( Epsilon S) పేరిట సిద్ధం చేసింది. ఇపుడు అది కూడా ప్రమాదానికి గురైనట్టు స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

Read also: Honda Dio 125 Price: స్మార్ట్‌కీతో హోండా డియో 125.. ధర ఎంతో తెలుసా?

గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్‌ను ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. ఇపుడు మార్పులతో పరీక్షించగా.. ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే విఫలమైంది. ఈ పరీక్షా కేంద్రం ఉత్తర అకితా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భారీ ఎత్తున మంటలు, పొగలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలను జాతీయ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టంపై సమాచారం అందలేదని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ (జేఏఎక్స్‌ఏ) అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. జపాన్‌ ఏరోస్పేస్‌ సంస్థ చేసిన ప్రయోగాల్లో రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి గత అక్టోబర్‌లో వైఫల్యం ఎదురైంది. వాస్తవానికి ఎప్సిలాన్‌ రాకెట్‌ ఆధారంగా 2013 నుంచి ఐదు ప్రయోగాలను నిర్వహించింది. వచ్చే ఏడాది ఎస్పిలాన్‌-ఎస్‌ రకం రాకెట్‌ను ప్రయోగించాలని జపాన్‌ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. తాజా ప్రయోగం విఫలం కావడంతో.. శాస్త్రవేత్తలే అది పేలిపోయేట్లు చేయాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అతి భారీ అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహించే దేశాల్లో జపాన్‌ ఒకటి. ఈ దేశానికి చెందిన ఆస్ట్రోనాట్‌ కొయిచీ వకాట గతేడాది అక్టోబర్లో క్రూ-5 మిషిన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే.