Japanese Train Runs on Fuel Generated From Ramen Soup: ఈ ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి.. మానవుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఊహకందని ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా జపాన్ వాళ్లు ఓ కొత్త ప్రయోగంతో ఆశ్చర్యచకితుల్ని చేశారు. నూడుల్స్ సూప్‌తో తయారు చేసిన పదార్థంతో.. రైలుని విజయవంతంగా నడిపారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ.. ఈ విచిత్రమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జపాన్ వారు ఎక్కువగా తినే రెండు రకాల వంటకాల వ్యర్థాలతో ఈ ప్రమోగం చేసింది.
జపాన్ వాసులు టొంకుట్సు రామెన్ సూప్ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలతోగానీ, మాంసంతోగానీ చేసే డీప్ ఫ్రై) వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం రెస్టారెంట్లలోనే కాదు.. ఇళ్లల్లోనూ వీటిని పెద్దఎత్తున తయారు చేసుకుంటారు. అయితే.. అంతే స్థాయిలో ఈ వంటకాలు వృధా అవుతుంటాయి కూడా! దీన్ని అరికట్టడం కోసమే.. ఏదైనా ఒక పరిష్కారాన్ని వెతకాల్సిందేనని ఆలోచించారు. ఎట్టకేలకు వాళ్లకు ఓ వినూత్న ఆలోచన తట్టింది. వృధా అవుతున్న ఆ ఆహార పదార్థాల నుంచి బయో డీల్ తయారు చేయాలని నిర్ణయించారు. జపాన్ టాకచిహో రైల్వే అధికారులు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యర్థాల నుంచి బయో డీజిల్ నుంచి తయారు చేసే బాధ్యతను నిషిడా షౌన్ అనే రవాణా కంపెనీకి అప్పగించారు.
ఆ నిషిడా షౌన్ సంస్థ కొన్ని రెస్టారెంట్ల నుంచి రామెన్ సూప్, టెంపురా వంటకాల వ్యర్థాలను సేకరించింది. వాటిని రసాయనాలతో శుద్ధి చేసి, బయో డీజిల్‌ను తయారు చేసింది. మొదట ఈ బయో డీజిల్‌తో కొన్ని రైలింజన్లను నడపగా.. ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో.. ఇటీవల మియాజాకీ నగరంలో ఓ సైట్-సీయింగ్ రైలుని ఆ వృథా బయో డీజిల్‌తో నడిపింది. ఈ రైలు నడుపుతున్నప్పుడు.. దాన్నుంచి వెలువడే పొగలు సదరు వంటకం వాసనను వెదజల్లాయని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రోన్ల ద్వారా ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోని సదరు సంస్థ తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్‌గా మారింది.