NTV Telugu Site icon

Monkeypox: జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

Monkeypox Virus

Monkeypox Virus

Monkeypox: ప్రపంచాన్ని కరోనా హడలెత్తిస్తున్న వేళ మరో మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. వైరస్‌ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

తాజాగా జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తిలో తొలిసారిగా మంకీపాక్స్‌ను నిర్ధారించినట్లు జపాన్ సోమవారం ధృవీకరించిందని టోక్యో గవర్నర్ యురికో కోయికే ప్రకటించారు. ఆ వ్యక్తి యూరప్‌ నుంచి తిరిగి వచ్చినట్లు గుర్తించారు. జపాన్ ఇది మొదటి మంకీపాక్స్ కేసు అని గవర్నర్ వెల్లడించారు. ఆ వ్యక్తిని టోక్యోలోని ఆసుపత్రిలో చేర్చారని పేర్కొన్నారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అవసరమైన చర్యల గురించి జపాన్‌ ప్రభుత్వ అధికారులు సమావేశం నిర్వహించిన మరుసటి రోజే మంకీపాక్స్ కేసు నమోదు కావడం గమనార్హం.

Commonwealth Games 2022: భారత్‌కు మరో షాక్.. డోప్ టెస్ట్‌లో మరొకరు బుక్

ప్రపంచానికి మంకీపాక్స్‌ను పెనుముప్పుగా డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తోంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా డబ్ల్యూహెచ్ఓ కీలక చర్యలు తీసుకోనుంది. అయితే గత నెలలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌ను ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ నిరాకరించింది.. అయితే గత వారం నుంచి గణనీయంగా కేసుల సంఖ్య పెరగడంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో 16,800లకు పైగా కేసులు నమోదు అయ్యాయి. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు ఏకంగా కేసుల సంఖ్య 77 శాతానికి పెరిగింది. ఇటీవల భారత్‌లో కూడా నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. యూకేలో ప్రారంభం అయిన మంకీపాక్స్ కేసులు క్రమంగా యూరోపియన్ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాల్లో కూడా కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో 11 శాతం కేసులు ఉన్నాయి. ఇటీవల పలు అధ్యయనాల్లో 95 శాతం కేసులు శృంగారం ద్వారానే సంక్రమిస్తుందని తేలింది.