NTV Telugu Site icon

Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో చావుదెబ్బ.. నస్రల్లా వారసుడిని హతం..

Hashem Safieddine

Hashem Safieddine

Israel Hezbollah War: లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని నామరూపాలు లేకుండా చేయాలని ఇజ్రాయిల్ భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే రాజధాని బీరూట్‌పై వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. ఇక దక్షిణ లెబనాన్‌పై భూతల దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 2000కి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ బీరూట్ ఎయిర్ స్ట్రైక్స్‌లో హతమార్చింది.

Read Also: Ponguleti Srinivas Reddy: రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండా చేస్తాం..

నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా, హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా చెప్పబడుతున్న హషీమ్ సఫీద్దీన్ కూడా తాజాగా జరిగిన దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ ఈ విషయాన్ని నివేదించింది. నస్రల్లా మరణించిన వారంలోపే కొత్త బాస్‌ని కూడా చంపేసింది. దక్షిణ బీరూట్‌లో జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు చెప్పింది. హిజ్బుల్లాకు చెందిన ఉన్నతస్థాయి నేతలు భూగర్భ బంకర్‌లో సమావేశమవుతున్నారనే సమాచారంతో ఇజ్రాయిల్ దాడులు చేసింది. బీరూట్‌లోని దహీహ్ శివారులోని ఈ దాడి జరిగినట్లు ఆల్ హదత్ తెలిపింది.

ఇప్పటికే హిజ్బుల్లాకు చెందిన ప్రముఖ నాయకులంతా ఒక్కొక్కరుగా ఇజ్రాయిల్ దాడుల్లో మరణించారు. ఆ సంస్థ మిలిటరీ స్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతింది. మిగతా నాయకులు, కార్యకర్తల్ని వెతికి వెంటాడి చంపేస్తోంది. నస్రల్లా తర్వాత సఫీద్దీన్ శక్తివంతమైన నేతగా చెప్పబడుతున్నాడు. ఇతడిని 2017లో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉగ్రవాదిగా గుర్తించింది. 1960ల ప్రారంభంలో దక్షిణ లెబనాన్‌లో జన్మించిన సఫీద్దీన్ హిజ్బుల్లా యొక్క వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ప్రస్తుతం హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే దాడుల్లో హతమయ్యాడు.