NTV Telugu Site icon

Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా 210 మంది.. ఇజ్రాయిల్ సైన్యం ప్రకటన..

Gaza

Gaza

Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి జరిపారు. ఈ దాడిలో ఇజ్రాయిల్ లోని 1400 మంది చనిపోయారు. మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా దారుణంగా ఊచకోతకు పాల్పడ్డారు. మరికొంత మందిని బందీలుగా గాజా ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం హమాస్ వద్ద 210 మంది ఇజ్రాయిల్ ప్రజలు బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. అయితే ఇది తుది సంఖ్య కాదని, తప్పిపోయిన వారి కోసం మిలిటరీ దర్యాప్తు జరుగుతోందని, బందీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి అన్నారు. నిన్న ఇద్దరు అమెరికన్ తల్లి కూతుళ్లను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టారు. వీరు కాకుండా 210 మంది బందీలుగా ఉన్నారని తెలిపారు.

Read Also: Jadcherla MLA: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసిన జడ్చర్ల డీసీఎం అసోసియేషన్.. పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని హామీ

గాజాలో మానవతా సంక్షోభం లేదు: ఐడీఎఫ్

గాజాలోని బందీలను విడిపించడంతో పాటు హమాస్ ఉగ్రవాదులను నేలమట్టం చేయడానికి ఇజ్రాయిల్ ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఉత్తర భాగం నుంచి ప్రజలు సురక్షితం ప్రదేశమైన దక్షిణ ప్రాంతం వైపు వెళ్లాలని ఆదేశించింది. దీంతో లక్షలాది మంది పాలస్తీయన్లు దక్షిణ వైపు వెళ్లారు. అయితే గాజాలో ఎలాంటి మానవతా సంక్షోభం లేదని ఐడీఎఫ్ శనివారం తెలిపింది. 10 లక్షల మందిలో 7 లక్షల మంది ఉత్తర ప్రాంత నివాసితులు కొన్ని రోజుల క్రితం దక్షిణ ప్రాంతానికి వెళ్లారని తెలిపింది.

నీటి కొరత గాజాలో లేదని, వారాలకు సరిపడే ఫుడ్ ఉందని, మెడిసిన్ సప్లై కూడా ఉందని ఇజ్రాయిల్ రక్షణ అధికారి వెల్లడించారు. హమాస్ ప్రజలు దక్షిణ భాగం వైపు వెళ్లకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈజిప్టు నుంచి గాజా దక్షిణ ప్రాంతంలోని రఫా క్రాసింగ్ నుంచి ఫుడ్, వాటర్, మెడిసిన్ సాయం లభిస్తోందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియల్ హగారి అన్నారు.

గత రెండు వారాల నుంచి ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. ఈ యుద్ధంలో అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి అనంతరం నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానికి దళం నిప్పులు కురిపిస్తోంది. గాజాలో ఇప్పటి వరకు 4000 మంది మరణించారు. హమాస్ కీలక ఉగ్రవాదులను ఇజ్రాయిల్ మట్టుబెడుతోంది.